Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ లో ఆ జట్టు తరఫున ఆడాలని ఉంది.. వాళ్లిద్దరంటే నాకు పిచ్చి.. జూనియర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Dewald Brevis: విండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా తరఫున పరుగుల వరద పారిస్తున్న  ఆ జట్టు యువ సంచలనం  డెవాల్డ్ బ్రేవిస్.. వచ్చే ఐపీఎల్ లో తనకు ఆడే అవకాశమొస్తే... 

South Africa Under-19 Sensation Dewald Brevis Want to  Play For RCB, he reveals His Favorite Cricketers
Author
Hyderabad, First Published Jan 28, 2022, 4:46 PM IST

దక్షిణాఫ్రికా యువ సంచలనం, జూనియర్ డివిలియర్స్ గా  అక్కడి అభిమానులు పిలుచుకుంటున్న  డెవాల్డ్ బ్రేవిస్.. తన ఐపీఎల్ కలల గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో పరుగుల వరద పారిస్తున్న ఈ యువ ఆటగాడు..  తనకు భారత్ లో ఆడటమంటే ఇష్టమని చెప్పాడు. ఐపీఎల్ లో ఆడే అవకాశమొస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలని ఉందన్నాడు. ఐపీఎల్ తో పాటు తనకు ఇష్టమైన క్రికెటర్లు, తన లక్ష్యాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అచ్చం ఏబీడీ లాగే ఆడే బ్రేవిస్ ను అక్కడి అభిమానులు ‘బేబి ఏబీడీ’ అని పిలుచుకుంటున్నారు.  ఏబీడీ స్థానాన్ని బ్రేవిస్ భర్తీ చేస్తాడని ఆ దేశ అభిమానులు భావిస్తున్నారు. అతడి ఆట కూడా  డివిలియర్స్ మాదిరే ఉంటుంది. 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే తనకు చాలా ఇష్టమని, ఈ లీగ్ లో ఆడే అవకాశమొస్తే ఆర్సీబీ తరఫున ఆడాలని ఉందని  బ్రేవిస్ చెప్పాడు. తాను డివిలియర్స్ తో పాటు విరాట్ కోహ్లీలను ఆరాధిస్తానని అన్నాడు.  

 

బ్రేవిస్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ కు నేను వీరాభిమానిని. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడాలని నేను కోరుకుంటున్నాను.  ఆ జట్టులో నాకు ఇష్టమైన క్రికెటర్లు ఉన్నారు. ఏబీ డివిలియర్స్ తో పాటు విరాట్ కోహ్లి కూడా అదే జట్టుకు ఆడుతున్నారు..’ అని అన్నాడు. కాగా.. గత సీజన్ వరకు కోహ్లి, డివిలియర్స్ లు ఆర్సీబీ తరఫునే ఆడారు. కానీ 2021 సీజన్ తర్వాత డివిలియర్స్ ఐపీఎల్ తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లి  కూడా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కానీ జట్టుతో కొనసాగుతున్నాడు. 

ఐపీఎల్ తో పాటు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని లీగులలో ఆడాలని  ఉందని బ్రేవిస్ చెప్పాడు. తాను లెగ్ స్పిన్ కూడా బౌలింగ్ చేయగలనని,  ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాలన్నది తన లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. కేవలం టీ20లకే  పరిమితం కాకుండా అన్ని ఫార్మాట్లకు ఆడాలనుకుంటున్నానని  బ్రేవిస్ వెల్లడించాడు. 

 

కాగా..  వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో బ్రేవిస్ అదరగొడుతున్నాడు. ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా తరఫున ఆడిన గత ఐదు మ్యాచులలో అతడి స్కోర్లు... 97, 96, 104, 65, 50.. గా ఉన్నాయంటే అతడు ఎంతటి భీకర ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలాఉండగా.. బ్రేవిస్ ను ఐపీఎల్ వేలంలో దక్కించుకోవాలని ఆర్సీబీ చూస్తున్నట్టు సమాచారం.  అతడిని రూ. 2 కోట్లు ధరతో చెల్లించుకునేందుకు ఆర్సీబీ యత్నిస్తుందని సోషల్ మీడియాలో ఆ జట్టు అభిమానులు పోస్టులు పెడుతున్నారు.  దీనిపై ఇప్పటికైతే ఆర్సీబీ స్పందించలేదు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలుసుకోవాలంటే  ఫిబ్రవరి 13 దాకా ఆగాల్సిందే..

Follow Us:
Download App:
  • android
  • ios