కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. కాగా... ఈ లాక్ డౌన్ కారణంగా దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ లిజెల్లీ లీ పెళ్లి ఆగిపోయింది. తన ప్రియుడు తాంజా క్రోనేతో ఏప్రిల్‌ 10న లిజెల్లీ లీ వివాహం జరగాల్సి ఉంది. లాక్‌డౌన్‌లో అది 15వ రోజుగా ఉండడంతో.. వివాహం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా లీ ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద వ్యవసాయ పట్టణం అయిన ఎర్మెలాలో ఉంటుంది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది.

తాజాగా 28 ఏళ్ల లిజెల్లీ లీ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు మంచి స్థితిలో ఉంది. ఎలాంటి జట్టుకూ భయపడం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుతో మాకు ఆడాలని ఉంది. అత్యుత్తమ జట్టును ఓడించి తమ సత్తా ఏంటో చాటాలనుకుంటున్నాం' అని తెలిపింది. ఒకవేళ కరోనా ప్రభావం లేకుంటే దక్షిణాఫ్రికా.. ఇప్పటికే ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20 పూర్తి చేసుకునేది.

ఇటీవలే ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీస్ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే వర్షం దక్షిణాఫ్రికా ఫైనల్ ఆశలను చిదిమేసింది. లిజెల్లీ లీ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్, 82 వన్డేలు, 74 టీ20లు ఆడింది. వన్డేల్లో రెండు, టీ20లలో ఒక సెంచరీ చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లిజెల్లీ ఇంట్లో వంట చేస్తూ.. పజిల్ గేమ్ ఆడుతూ గడుపుతోంది.