గబ్బాలో సఫారీలను గజగజ వణికించిన కంగారులు.. తొలి టెస్టు ఆసీస్‌దే..
ఇటీవలే ముగిసిన విండీస్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. దక్షిణాఫ్రికా పైనా జోరు చూపిస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలను 152 పరుగులకే ఆలౌట్ చేసి రెండో ఇన్నింగ్స్ లో డబుల్ డిజిట్ స్కోరుకే పరిమితం చేసింది. స్వల్ప లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా తొలి టెస్టులో దారుణంగా ఓడింది. గబ్బా (బ్రిస్బేన్) వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కంగారు బౌలర్ల ధాటికి సఫారీ బ్యాటర్లు గజగజ వణికారు. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో మూడంకెల స్కోరు కూడా చేయలేక చతికిలపడింది. ఆసీస్ బౌలర్ల ధాటికి 99 పరుగులకే చాప చుట్టేసింది. దక్షిణాఫ్రికా నిలిపిన 34 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఇటీవలే ముగిసిన విండీస్ తో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. దక్షిణాఫ్రికా పైనా జోరు చూపిస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో సఫారీలను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ లో తడబడింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్.. 218 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్.. 96 బంతుల్లో 92 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. విండీస్ తో సిరీస్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన లబూషేన్ (11) తో పాటు స్మిత్ (36), ఖవాజా (11) లు దారుణంగా విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్ డకౌట్ అయి మరోసారి నిరాశపరిచాడు. గ్రీన్ (18), అలెక్స్ కేరీ (22) లు రాణించలేకపోయారు. ఓవర్ నైట్ స్కోరు 145-5 వద్ద రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 218 పరుగులకు ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 66 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరోసారి విఫలమైంది. ఆ జట్టులో జోండో (36) టాప్ స్కోరర్. 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇందులో నలుగురు డకౌట్ అయ్యారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (2), వన్ డర్ డసెన్ (0), వెర్రెయన్ (0), మార్కో జాన్సేన్ (0), కేశవ్ మహారాజ్ (16) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. ఆసీస్ బౌలర్లలో సారథి పాట్ కమిన్స్ కు ఐదు వికెట్లు దక్కగా బోలండ్, స్టార్క్ కు రెండేసి వికెట్లు పడ్డాయి. స్పిన్నర్ నాథన్ లియాన్ కు ఒక వికెట్ దక్కింది. సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ వైఫల్యంతో ఆసీస్ ఎదుట 34 పరుగుల లక్ష్యాన్ని నిలిపారు.
రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. 5 ఓవర్లలో 9 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖవాజా 2 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 3 పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లూ రబాడాకే దక్కాయి. స్టీవ్ స్మిత్ (6), ట్రావిస్ హెడ్ (0) కూడా విఫలమయ్యారు. ఈ నాలుగు వికెట్లూ రబాడాకే దక్కడం విశేషం. సౌతాఫ్రికా గనక ఆసీస్ ముందు మరో 70-80 పరుగుల లక్ష్యాన్ని నిలిపి ఉంటే కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండేదే. రెండ్రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో వికెట్లతో బౌలర్లు పండుగ చేసుకున్నారు.