2023 వన్డే వరల్డ్ కప్‌కి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా... వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు క్వింటన్ డి కాక్ గుడ్‌బై.
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు... వరల్డ్ కప్ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వబోతున్న క్వింటన్ డి కాక్..

అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కి సరిగ్గా సెట్ అవుతుంది. స్టార్ ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నా అదృష్టం కలిసి రాక ఐసీసీ టైటిల్ గెలవలేకపోతోంది సౌతాఫ్రికా. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా కూడా వన్ ఆఫ్ టైటిల్ ఫెవరెట్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు. తెంబ భవుమా కెప్టెన్‌గా వ్యవహరించే వన్డే జట్టులో క్వింటన్ డి కాక్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా, కగిసో రబాడా, తబ్రీజ్ షంషీ, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ వంటి సీనియర్లు అందరికీ చోటు దక్కింది..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా, అక్టోబర్ 7న ఢిల్లీలో శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 5న కోల్‌కత్తాలో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ జరుగుతుంది.
30 ఏళ్ల క్వింటన్ డి కాక్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే డిసెంబర్ 2021లో టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు క్వింటన్ డి కాక్. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత కేవలం టీ20 ఫార్మాట్ ఆడుతూ, టీ20 లీగులతో బిజీగా ఉండబోతున్నాడు 30 ఏళ్ల క్వింటన్ డి కాక్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సౌతాఫ్రికా జట్టు: తెంబ భవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రీచ్ క్లాసిన్, సిసండ మగల, కేశవ్ మహరాజ్, అయిడిన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఇంగిడి, ఆన్రీచ్ నోకియా, కగిసో రబాడా, తబ్రీజ్ షంషీ, రస్సీ వాన్ దేర్ దుస్సేన్
2021లో టెస్టు రిటైర్మెంట్ ఇచ్చిన ఫాఫ్ డుప్లిసిస్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో చివరి వన్డే ఆడాడు. టెస్టు రిటైర్మెంట్ తర్వాత ఫాఫ్ డుప్లిసిస్‌ని వన్డే, టీ20 జట్టు నుంచి కూడా తప్పించింది సౌతాఫ్రికా. ఫాఫ్ డుప్లిసిస్‌కి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా, అతన్ని సౌతాఫ్రికా బోర్డు పట్టించుకోలేదు.
2019 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగాల్సింది. అయితే ప్రపంచ కప్‌కి కొన్ని నెలల ముందు ఏబీ డివిల్లియర్స్, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అప్పటిదాకా టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న ఏబీ డివిల్లియర్స్, రిటైర్మెంట్ తీసుకోవడంతో ఒక్కసారిగా సౌతాఫ్రికా టీమ్ షాక్‌కి గురైంది.
ఈ ఎఫెక్ట్ 2019 వన్డే వరల్డ్ కప్‌లో పడింది. టైటిల్ ఫెవరెట్ అవుతుందనుకున్న సౌతాఫ్రికా, 9 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకోగలిగింది.. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకలపై సునాయస విజయాలు అందుకున్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సంచలన విజయం అందుకుంది. అయితే అప్పటికే ఆస్ట్రేలియా, సెమీ ఫైనల్స్‌కి అర్హత సాధించగా సౌతాఫ్రికా వరుస పరాజయాలతో ఏడో స్థానానికి పరిమితమైంది.