ఆసియా కప్ రద్దయ్యిందంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మండిపడ్డింది. ఆయన మాటలకు ఎలాంటి విలువ లేదని కొట్టిపారేశారు పీసీబీ మీడియా డైరెక్టర్ శామ్యూల్ హసన్ బర్నీ.

అసలు ఆసియా కప్ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏససీ) అని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ప్రకటలను కేవలం ఏసీసీ ప్రెసిడెంట్ మాత్రమే చేయాలని.. గంగూలీ వ్యాఖ్యలు మ్యాచ్ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవని అన్నారు.

గంగూలీ ప్రతీ వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారని, దాదా మాటలకు విలువ లేదని బర్నీ తేల్చిపారేశారు. తమకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదన్నారు.

Also Read:క్రికెట్ అభిమానులకు షాక్.. ఆసియా కప్ లేనట్లే: ప్రకటించిన గంగూలీ

కాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో గంగూలీ ఆసియా కప్ 2020 రద్దయినట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళతామని, తమకు ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌ను పాకిస్తాన్  నిర్వహించాల్సి వుంది. అయితే బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి అభ్యంతరాలు తెలపడంతో వేదిక దుబాయ్‌కు మారింది. సెప్టెంబర్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది.