ముంబై: భారత ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాకు రాహుల్ ద్రావిడ్ నాయయకత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ) షాక్ ఇచ్చింది. బుమ్రాకు ఫిట్నెస్ టెస్టు నిర్వహించలేమని తేల్చి చెప్పింది. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న బుమ్రా తిరిగి అడుగు పెట్టాలంటే ఎన్ ఎసిఎ టెస్టు పాస్ కావాల్సిందే. 

గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా అకాడమీని కాదని, తనంత తాను నిర్ణయం తీసుకున్నాడని అంటూ అతను ఏ మేరకు పురోగతి సాధించడనే విషయం తెలియంకుండా, క్రమం తప్పకుండా సమీక్ష చేయకుండా హఠాత్తుగా ఫిట్నెస్ నిర్వహించడం కుదరని ఎన్ సిఎ తెలిపింది. 

బుమ్రాకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించేందుకు టీమిండియా ట్రైనర్ నిక్ వెబ్ ను బెంగళూరుకు పిలువాలని ఎన్ సిఎ అనుకుంది. అయితే, బుమ్రా అంతా మెరుగైన తర్వాత టెస్టు ఎందుకని అనుకున్నాడు. దీంతో గుర్రుగా ఉన్న ద్రావిడ్ ఆగ్రహంగా ఉన్నాడు. బుమ్రాకు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్ ట్రెయినర్ యోగేశ్ ఫర్మార్ తేల్చి చెప్పారు. 

దానిపై స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించగా ద్రావిడ్ అందుబాటులోకి రాలేదు. బుమ్రా వివరణ కోరేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. 

ఆ వ్యవహారంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం స్పందించారు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ద్రావిడ్ ను అడిగి తెలుసుకుంటానని ఆయన చెప్పారు. సమస్య ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకుని పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. 

బిసిసిఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రావిడ్ తో ఎన్ సిఏ విషయంపై మాట్లాడానని, కుర్రాళ్లను తీర్చిదిద్దే అంశంలో అకాడమీలో అతని పరిధిని దాటి కూడా పెంచానని ఆయన చెప్పారు. 

గాయాలకు ఎన్ సిఎ చికిత్స అందిస్తుందని, పునరావాస శిబిరాలు ఎన్ సిఏ ఆధ్వర్యంలో జరగాలని, భారత ఆటగాళ్లు ఎవరైనా ఇదే పాటించాలని గంగూలీ అన్నాడు.