Sourav Ganguly: భారత క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. క్రికెట్ నుంచి రిటైరైనా బెంగాల్, బీసీసీఐలలో కీలక పదవులు అనుభవించిన కోల్‌కతా ప్రిన్స్.. బోర్డు రాజకీయాలకు బలయ్యాడా..?
భారత క్రికెట్‌ను కెప్టెన్‌గానే గాక బోర్డు అధ్యక్షుడిగా కూడా ఏలిన బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ శకం ముగిసింది. కెప్టెన్ గా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) లో కీలక పదవులు అనుభవించిన దాదా ఆ తర్వాత తన పలుకుబడితో ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డులో చక్రం తిప్పాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఒక పర్యాయం అధికారాన్ని అనుభవించిన దాదా.. రెండో దఫా కూడా తిరిగివస్తాడని అంతా భావిస్తుంటే గంగూలీకి ఊహించని షాక్ తగిలింది. బెంగాల్‌లో గంగూలీనీ కలుపుకుని అధికారం చేజిక్కించుకోవాలని చూసిన కమలనాథులకు ‘నాకు రాజకీయాలు ఆసక్తి లేదు’ అని పదేపదే చెప్పిన దాదా.. ఇప్పుడు అవే ‘రాజకీయాలకు’ బలయ్యాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
తనకు ఇష్టం లేకున్నా అధ్యక్ష పదవి నుంచి దాదా నిరాశతో వెనుదిరిగుతున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గంగూలీకి ఈ షాక్ తగలడంలో తనకు ‘క్లోజ్ ఫ్రెండ్’అని చెప్పుకుంటున్న బీసీసీఐ సెక్రటరీ పాత్ర కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీసీఐలో గంగూలీ అకారణంగా స్టంపౌట్ కావడానికి కారణమే అతడేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
‘క్రెడిట్’ దక్కలేదు..
2019లో బీసీసీఐ చీఫ్ గా ఎన్నికైన దాదాకు ఈ బాధ్యతలు నల్లేరు మీద నడకలా సాగలేదు. వాస్తవానికి గంగూలీ బోర్డు అధ్యక్షుడయ్యాక ఎనిమిది నెలలకే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. కరోనాతో ప్రపంచంలోని పలు రంగాలతో పాటు క్రీడా రంగం కూడా క్రీడలను ఎలా నిర్వహించాలని ఆలోచిస్తున్న తరుణంలో ‘బయో బబుల్’ ద్వారా ఐపీఎల్ వంటి మెగా టోర్నీ నిర్వహించడంలో దాదా కీలక పాత్ర పోషించాడు. 2020లో దుబాయ్ లో నిర్వహించిన ఈ టోర్నీ విజయవంతమైంది. ఆ తర్వాత రెండేండ్లు కూడా భారత్ లో ఐపీఎల్ విజయవంతమైంది. ఐపీఎల్ నిర్వహణ అనేది ఏ ఒక్కరి చేతుల్లో లేకున్నా క్రెడిట్ మాత్రం గంగూలీకి గాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా కు దక్కింది.
ఇక ఈ ఏడాది భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రీడా రంగమే నివ్వెరపోయే విధంగా ఐపీఎల్ మీడియా హక్కుల వేలం జరిగింది. సుమారు రూ. 50 వేల కోట్లు (రూ. 48,390 కోట్లు) బీసీసీఐ ఖాతాలోకి వెళ్లాయి. అయితే వేలం నిర్వహణ క్రెడిట్ కూడా దాదాకు దక్కలేదు. బీసీసీఐ ట్రెజరరీ గా ఉన్న అరుణ్ ధుమాల్ (కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు) కు ఆ క్రెడిట్ దక్కింది.
బోర్డు నమ్మకం కోల్పోయి..
బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ ఈ మూడేండ్ల కాలంలో సంచలన నిర్ణయాలేమీ తీసుకోలేకపోయినా.. బీసీసీఐని ‘తెర వెనుక నడిపించే పెద్దల’కు మాత్రం దాదా పనితీరు నప్పలేదని తెలుస్తున్నది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, రవిశాస్త్రితో విభేదాలు బోర్డు పరువును బజారుకీడ్చాయి. గతేడాది కాలంగా కోహ్లీ-గంగూలీల రచ్చ గురించి జరిగినంత చర్చ బహుశా భారత క్రికెట్ లో మరే అంశం మీద జరగలేదంటే అతిశయోక్తి కాదు. సదరు ‘పెద్దల’కు ఇది మింగుడుపడలేదు. అదీగాక జట్టు సెలక్షన్ విషయంలో దాదా తలదూరుస్తున్నాడని.. సెలక్టర్లకు కూడా స్వేచ్ఛ లేదని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలన్నీ దాదా రెండోసారి అధ్యక్ష ఆశలకు గండికొట్టాయి.
ఐసీసీ ఆశలు గోవిందా గోవిందా..
ఒక క్రికెటర్ గా దేశానికి సారథ్యం వహించడం కంటే గొప్ప గౌరవం ఏముంటుంది..? దాదా ఆ దశను తాను కెప్టెన్ గా ఉన్నప్పుడే దాటేశాడు. ఆ తర్వాత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లో తన మెంటార్ దాల్మియాతో కలిసి చక్రం తిప్పాడు. అదే స్పీడ్ లో బీసీసీఐలోకి వచ్చాడు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కకున్నా ఈ ఏడాది నవంబర్ లో జరిగే ఐసీసీ అధ్యక్ష రేసులో నిలుద్దామనుకున్న దాదాకు నిరాశే ఎదురైంది. ‘ఐసీసీ లేదు గీసీసీ లేదు. ఐపీఎల్ చైర్మెన్ గా ఉంటే ఉండు లేదంటే కోల్కతాకు వెళ్లు..’ అని బోర్డు అధికారులు కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో క్రికెట్ లో అత్యున్నత పదవి చేపట్టాలనే ఆశ తీరకుండానే బెంగాల్ టైగర్ తప్పుకుంటున్నాడని అతడి అభిమానులు వాపోతున్నారు. దాదాకు బీసీసీఐ చైర్మెన్ గిరితో పాటు ఐసీసీ ఆశలు గల్లంతవడానికి కారణం జై షానే అని గంగూలీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టులో పంతం నెగ్గించుకున్నా..
రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టడం కోసం బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలను సుప్రీంకోర్టులో ఆమోదించుకున్న బోర్డు పాలకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ రెండో దఫా ఏదో ఒక పదవిలో ఉండబోతున్నారు. కానీ దాదా మాత్రం ఏ పదవి లేకుండానే వెనుదిరుగుతుండటం విషాదకరం.
