ముంబై: బిసిసిఐ నూతన అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నిక కానున్నారు. ఆయన ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జయ్ షా బిసిసిఐ కార్యదర్శిగా ఎన్నికవుతున్నారు. అరుణ్ ధమాల్ బిసిసిఐ కొత్త కోశాధికారిగా ఎన్నికవుతున్నారు. 

అరుణ్ ధమాల్ బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, ఆర్థిక సహాయ మంత్రి ధుమాల్ తమ్ముడు. బిసిసిఐ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు. అయితే, గత వారం రోజులుగా జరుగుతున్న చర్చలు, రాయబారాల ఫలితంగా ఎన్నికలు ఏకగ్రీవం అవుతున్నాయి. 

టీమిండియా మాజీ కెప్టెన్ అయిన 47 గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బిసిసిఐ అధ్యక్ష పదవికి మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ కూడా పోటీ చేయడానికి ప్రయత్నించారు. బ్రిజేష్ పటేల్ ను ఎన్. శ్రీనివాసన్ ను బలపరిచారు. అయితే, బ్రిజేష్ పటేల్ అభ్యర్థిత్వానికి సరైన మద్దతు లభించలేదు. 

బ్రిజేష్ పటేల్, సౌరవ్ గంగూలీ మధ్య అధ్యక్ష పదవికి పోటీ నెలకొన్న స్థితిలో విస్తృతమైన చర్చల నేపథ్యంలో బ్రిజేష్ పటేల్ తప్పుకున్నారు.