Asianet News TeluguAsianet News Telugu

బీసీసీఐ నుంచి గంగూలీ ఔట్.. బీజేపీలో చేరకపోవడమే కారణమన్న టీఎంసీ.. బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడి పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దాదాపు దూరమైనట్టే. ఈ నేపథ్యంలో ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఇది బీజేపీ చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 

Sourav Ganguly likely to out of bcci president post leads to TMC BJP war
Author
First Published Oct 12, 2022, 9:47 AM IST

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడి పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దాదాపు దూరమైనట్టే.  ఆయన స్థానంలో భారత్‌కు 1983 లో ప్రపంచ కప్ తీసుకొచ్చిన హీరోగా పేరొందిన రోజర్ బిన్నీ.. బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టం ఖాయంగా తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీ వైదొలగనున్నారనే వార్తల నేపథ్యంలో.. ఆయన సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ఇది బీజేపీ చేస్తున్న రాజకీయ ప్రతీకార చర్య అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 

రాజకీయ ప్రతీకారానికి ఇది మరో ఉదాహరణ అని టీఎంసీ ఎంపీ శంతను సేన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘అమిత్ షా కుమారుడిని బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించవచ్చు. కానీ గంగూలీ మాత్రం కొనసాగించరు. అతను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారా? లేక బీజేపీలో చేరలేదా? మేము మీతో ఉన్నాం దాదా!’’ అని శంతను సేన్ పేర్కొన్నారు. 

అలాగే శంతను సేన్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది మేలో గంగూలీస్ నివాసానికి విందు కోసం వచ్చారని అన్నారు.  గంగూలీని బీజేపీలో చేరాలని అమిత్ షా చాలాసార్లు కోరారని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గంగూలీ మారాలని అమిత్ షా కోరుకున్నారని అన్నారు. ఆ ఆఫర్‌ను తిరస్కరించినందుకే గంగూలీ అధ్యక్ష పదవిని లాగేసుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయంగా ప్రభావితమైన చర్య మాత్రమే కాదని.. క్రీడలను చౌకగా కాషాయీకరణ చేయడమేనని అన్నారు. బీజేపీ అన్ని అత్యున్నత నిర్వాహక పదవులను వారి నాయకుల కుటుంబ సభ్యులకే కేటాయించిందని విమర్శించారు. 

 


మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. తృణమూల్ ఆరోపణలను నిరాధారమైనవని పేర్కొంది. గంగూలీని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలపిింది. బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. శంతను సేన్ గానీ, తృణమూల్ పార్టీ గానీ.. సౌరవ్ గంగూలీకి ఏదైనా విధంగా సహాయం చేసిందా అనే విషయం తనకు తెలియదని అన్నారు. టీఎంసీ రాజకీయాలకు అలవాటు పడిందని.. ఇక్కడ కూడా ఆ పద్దతినే  కొనసాగిస్తుందని మండిపడ్డారు. రోజర్ బిన్నీకి ఎప్పుడైనా బీజేపీతో సంబంధం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేముందు..  తృణమూల్ ప్రభుత్వం బెంగాల్‌లో క్రీడలను పునరుద్ధరించడానికి కృషి చేయాలని సూచించారు. 

ఇక, సౌరవ్ గంగూలీ 2019 నవంబర్ 19న బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన బీసీసీఐ ప్రముఖుల సమావేశంలో..మరో దఫా బీసీసీఐ అధ్యక్షునిగా కొనసాగేందుకు గంగోలి ఆసక్తి కనపరిచినా.. ఆయనకు నిరాశే ఎదురైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గంగూలీ.. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం. 1983‌లో భారత్‌కు వరల్డ్ కప్ అందించిన టీమ్‌లో భాగమైన రోజర్ బిన్నీని గంగూలీ స్థానంలోకి రావడం ఖాయమైంది. ఇక, బీసీసీఐ కోశాధికారి పదవికి అరుణ్ ఠాకూర్ మళ్లీ పోటీ చేయనున్నారు. అరుణ్ ఠాకూర్ కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడనే సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios