న్యూఢిల్లీ: బెస్ట్ పుల్ షాట్ ఆడే క్రీడాకారుల ఐసీసీ జాబితాలో తన పేరు లేకపోవడంపై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు కోపమొచ్చింది. దీంతో ఆయన ఐసీసీని ట్రోల్ చేశాడు. బ్యాట్స్ మెన్ లో ఫుల్ షాట్ అత్యుత్తమంగా ఆడే ఎవరని ప్రశ్నిస్తూ ఐసీసీ ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టి వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హెర్ష్ లె గిబ్స్, విరాట్ కోహ్లీల పేర్లు ఇచ్చింది. దానిపై రోహిత్ శర్మ స్పందించాడు. 

దానిపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ఇందులో ఒకరు మిస్సయినట్లున్నారంటూ ట్వీట్ చేశాడు. ఆ జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయనకు కోపం వచ్చినట్లుంది. రోహిత్ శర్మ ట్వీట్ కు చాలా మంది నెటిజన్లు అనుకూలంగా ట్వీట్ చేశారు. 

కోహ్లీ కన్నా రోహిత్ శర్మ పుల్ షాట్ బాగా ఆడగలడని, అతన్ని విస్మరించి ఐసీసీ తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. దాంతో ఐసీసీ రోహిత్ శర్మ షాట్లతో కూడిన ఓ వీడియో పెట్టి, ఫెయిర్ ప్లే, రోహిత్ అనే వ్యాఖ్యను జోడించింది.   

షార్ట్ బాల్స్ ను బ్యాక్ ఫుట్ లో గానీ ఫ్రంట్ ఫుట్ లో గానీ పుల్ షాట్ ను చాలా అందంగా ఆడే క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకడనే విషయం అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మ బెస్ట్ అంటూ పలువురు ఇండియన్ క్రికెట్ అభిమానులు రిప్లై ఇచ్చారు. దానికి 2 వేలకు పైగా రిప్లైలు వచ్చాయి.