SL vs IRL:  శ్రీలంక   లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్  ప్రభాత్ జయసూర్య రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు.  బంతి చేతిలో పడితే  మినిమం  ఫైవ్ వికెట్స్ పక్కా  అనేంత రేంజ్ లో రెచ్చిపోతున్నాడు. 

లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య టెస్టులలో అబ్బురపరిచే ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. ఆడుతున్నది ఆరో టెస్టే అయినా ఇప్పటికే ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. గాలే వేదికగా శ్రీలంక - ఐర్లాండ్ మధ్య జరుగుతున్న తొల టెస్టులో జయసూర్య మాయాజాలంతో లంకను పటిష్ట స్థితిలో నిలిపాడు. జయసూర్యతో పాటు విశ్వ ఫెర్నాండో కూడా రాణించడంతో తొలి టెస్టులో ఐర్లాండ్ కష్టాల్లో పడింది.

రెండు టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు గాను లంకక వచ్చిన ఐర్లాండ్.. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టును ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో లంక 6 వికెట్ల నష్టానికి 591 పరుగులు చేసింది. లంక సారథి దిముత్ కరుణరత్నె (179), కుశాల్ మెండిస్ (140), చండిమాల్ (102), సమరవిక్రమ (104) లు సెంచరీలు బాదారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. జయసూర్య ధాటికి ఐర్లాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు.

Scroll to load tweet…

గతేడాది అరంగేట్రం.. 

31 ఏండ్ల ఈ వెటరన్ స్పిన్నర్ లంక జట్టులోకి చాలా లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు గతేడాది శ్రీలంకలో పర్యటించగా ఇదే గాలే వేదికగా టెస్టులలోకి అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో రెండు టెస్టులలోనూ అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ను కూడా ముప్పుతిప్పలు పెట్టాడు. జయసూర్య బౌలింగ్ మెరుపులతో లంక ఈ రెండు సిరీస్ లలో పరువు నిలబెట్టుకుంది. ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడిన జయసూర్య.. 10 ఇన్నింగ్స్ లలో 38 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండగా ఒక మ్యాచ్ లో పది వికెట్లు కూడా తీశాడు.

కాగా అతి తక్కువ మ్యాచ్ లలో ఐదు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న మూడో బౌలర్ గా జయసూర్య రికార్డలకెక్కాడు. ఈ జాబితాలో ఆసీస్ బౌలర్ రాడ్నీ హగ్.. మూడు మ్యాచ్ లలోనే ఈ ఘనతను అందుకోగా.. ఇంగ్లాండ్ టామ్ రిచర్డ్‌సన్.. 4 మ్యాచ్ లలో ఐదు సార్లు ఐదు వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్.. 6 మ్యాచ్ లలో 8 సార్లు ఐదు వికెట్లు తీశాడు. 

Scroll to load tweet…