హైదరాబాద్: భార్య సానియా మీర్జాను కలిసేందుకు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుమతి లభించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల భార్యాభర్తలు ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. దీంతో ఇంగ్లాండుతో జరిగే సిరీస్ కోసం అతను ఆలస్యంగా జట్టులో చేరుతాడని పీసీబీ ప్రకటించింది. 

తన భార్య సానియా మీర్జాను, కుమారుడిని ఐదు నెలలుగా లాక్ డౌన్ కారణంగా కలువలేదని చెబుతూ ఇంగ్లాండుతో జరిగే సిరీస్ కు ముందు కొంత సమయం ఇవ్వాలని షోయబ్ మాలిక్ పీసీబీని కోరాడు. దాంతో పీసీబీ భార్యను కలిసేందుకు పీసీబీ అనుమతించింది. 

షోయబ్ మాలిక్ దాదాపు ఐదు నెలలుగా తన కుటుంబాన్ని చూడలేదని, ప్రయాణాలపై ప్రస్తుతం ఆంక్షలు సడలిస్తున్నందున కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెసులుబాటు లభించిందని, మానవతా దృక్పథంతో షోయబ్ అభ్యర్థనను మన్నించి  కుటుంబాన్ని కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నామని పీసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్ అన్నారు. 

జూలై 24వ తేదీన షోయబ్ మాలిక్ ను భారత్ పంపేందుకు ఇంగ్లాండు, వేల్స్ క్రికెట్ బోర్డుతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మాలిక్ 2015లో టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. ఇంగ్లాండుతో జరిగిన ప్రపంచ కప్ తర్వాత నిరుడు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్ లో కొనసాగుతున్నాడు.