టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కానీ వన్డే, టీ20 ఫార్మాట్ లో మాత్రం అతడు భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే అతడు ఈ ప్రపంచ కప్ తర్వాత అన్ని ఫార్మాట్లకు రాజీనామా చేసి అంతర్జాతీయ క్రికెట్ నుండి శాశ్వతంగా వైదొలగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మరికొందరయితే ధోని ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి వుంటే రిషబ్ పంత్ వంటి యువ ఆటగాళ్లకు మంచి అవకాశం దక్కేదని విమర్శలకు కూడా దిగుతున్నారు. ఇలా ఈ మాజీ కెప్టెన్ కూల్ రిటైర్మెంట్ పై పలురకాల చర్చలు జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ  దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ ఈ విషయంపై స్పందిచాడు. 

ధోని  రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తూ ఆయన విమర్శలకు దిగుతున్న కొందరు నెటిజన్లకు వార్న్ చురకలు అంటించాడు. అతడు ఇప్పుడే చాలా మంచి క్రికెట్ ఆడుతున్నాడని... కాబట్టి అతడు ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ కావాల్సిన అవసరం లేదన్నారు. అయినా ఎప్పుడు క్రికెట్ నుండి వైదొలగాలో ధోనికి బాగా తెలుసని... కాబట్టి ఈ  విషయంపై తలలు బద్దలుకొని ఆలోచిస్తూ చర్చించడం ఆపేయాలని వార్న్ వారికి సూచించారు. 

''భారత క్రికెట్ కు ధోనీ అత్యుత్తమ సేవకుడు. ఇండియన్ క్రికెట్ కోసం అతడు ఎంతో చేశాడు. కొందరు ధోనీ ప్రపంచ కప్ జట్టులో ధోనీ లేకుంటే బావుండేదని అంటున్నారు. అందుకోసం వారు చెబుతున్న కారణాలను నేను నమ్మడం లేదు. అయినా ఇంతకాలం క్రికెటర్ గా కొనసాగిన ధోనికి ఎప్పుడు దూరం కావాలోకూడా తెలుసన్నారు. అయినా రిటైర్మెంట్  అనేది అతడి  వ్యక్తిగత విషయం.

అంతర్జాతీయ క్రికెట్ నుండి పూర్తిగా ఎప్పుడు తప్పుకోవాలో ధోనీగా బాగా తెలుసు. అది ప్రపంచ కప్ ముగిసిన వెంటనేనా...లేక మరో ఐదేళ్లా తర్వాతనా... ఏది మంచి సమయమో అతడికి బాగా తెలుసు. ప్రస్తుతానికి ధోని అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి ఎప్పుడు క్రికెట్ కు పూర్తిగా దూరమవ్వాలనుకుంటే అప్పుడే  కావచ్చు. ఆ విషయంలో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఇకనుండయినా అతడి  రిటైర్మెంట్ పై చర్చించడం మానేయాలి.'' అని వార్న్ సూచించారు.