Shane Warne Ball Of The Century: లెగ్ స్టంప్ కు ఆవల పడింది బంతి. ఆ ఏం తిరిగినా మహా అయితే మిడిల్ స్టంప్ వరకు వస్తుందిలే అనుకున్నాడు బ్యాటర్. స్టైల్ గా బ్యాట్, ప్యాడ్ అడ్డం పెట్టాడు. కానీ బంతిని విసిరింది మాంత్రికుడు కదా...
ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో థాయ్లాండ్ లోని తన విల్లాలో హఠాన్మరణం చెందిన వార్త క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టింది. 52 ఏండ్ల వార్న్.. మృతి చెందాడని తెలియగానే ఈ వార్త నిజం కాకుంటే ఉండే బాగుండు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వార్న్ అభిమానులు.. అతడి తోటి సహచరులు ప్రార్థించారు. కానీ తన విల్లాలో అచేతనావస్థలో పడి ఉన్న వార్న్.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. 15 ఏండ్ల కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అధిగమించి ప్రపంచంలో మరే స్పిన్నర్ కూడా చేరుకోని రికార్డులను సాధించిన వార్న్.. 90వ దశకంలో విసిరిన ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ ఇప్పుడు వైరల్ గా మారింది. దాని కథా కమామీషు ఏంటో ఒకసారి చూద్దాం.
అది 1993 జూన్ 4, మాంచెస్టర్ లో తొలి టెస్టు.. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ పెద్దగా స్కోరేమీ చేయలేదు. 289 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్ అథర్టన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చాడు మైక్ గాటింగ్. స్పిన్ బౌలింగ్ ఆడటంలో అతడు దిట్ట.
అప్పటికీ వార్న్ ఎంట్రీ ఇచ్చి సంవత్సరమే అవుతుంది. పెద్దగా అనుభవం కూడాలేదు. ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్.. వార్న్ కు బంతినిచ్చాడు. బంతిని అందుకున్న వార్న్.. ఫీల్డింగ్ సెట్ చేసుకుని మణికట్టు నుంచి అస్త్రాన్ని సంధించాడు. ఎక్కడో లెగ్ స్టంప్ ఆవల పడింది బంతి. ఆ ఇదేం చేస్తుందిలే అనే ధీమా గాటింగ్ ది. మహా అయితే స్పిన్అయినా ప్యాడ్ , బ్యాట్ కు తాకుతుందిలే అనుకుని స్టైల్ గా డిఫెన్స్ ఆడాడు. కానీ రెప్పపాటు క్షణంలో.. లెగ్ స్టంప్ కు ఆవల పడ్డ బంతి.. ఏకంగా రెండు అడుగులు స్పిన్ అయి సర్రున లోపలికి దూసుకొచ్చి ఆఫ్ స్టంప్ బెయిల్స్ ను పడగొట్టింది.
ఆసీస్ వికెట్ కీపర్ ఇయాన్ హీలితో పాటు ఆ జట్టు ఆటగాళ్లంతా సంబురాల్లో ఉన్నారు. కానీ ఇద్దరికి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ఇద్దర్లో ఒకరు గాటింగ్ కాగా.. మరొకరు అంపైర్. లెగ్ స్టంప్ ఆవల పడ్డ బంతి.. ఆఫ్ స్టంప్ బెయిల్స్ ఎలా పడగొట్టిందబ్బా.. అని అతడు తొంగి తొంగి చూశాడు.ఇక గాటింగ్ కు ఒకరకమైన మైకం కమ్మేసింది. అసలు బంతి లోపలికి అలా వచ్చింది రా దేవుడా..? అంటూ బిత్తర చూపులు చూసుకుంటూ పెవిలియన్ కు నడిచాడు.
ఆ బంతిని విసిరినప్పుడు వార్న్ గానీ.. ఔట్ అయినప్పుడు గాటింగ్ గానీ ఈ బాల్.. ఈ శతాబ్దపు బంతి అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. వాళ్లు పట్టించుకోకున్నా చరిత్ర మాత్రం ఆ బంతికి సరైన గౌరవం ఇచ్చింది. వార్న్ వేసిన ఆ బాల్ ను ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ గా చేరుస్తూ ఐసీసీ ప్రకటించింది. ఇప్పటితో మొదలైన ఈ మాంత్రికుడి ప్రస్థానం సుమారు రెండు దశాబ్దాల పాటు అప్రతీహాతంగా కొనసాగింది.
వార్న్ మరణం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ కి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. యూట్యూబ్ లో అయితే ఈ వీడియో కోసం నెటిజన్లు పిచ్చిపిచ్చిగా సెర్చ్ చేస్తున్నారు.
షేన్ వార్న్ తన కెరీర్ లో 145 టెస్టులు ఆడి 708 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 8-71. ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ప్రదర్శన 37 సార్లు చేయగా.. మ్యాచులో పది వికెట్లు 10 సార్లు సాధించాడు. బౌలర్ గానే గాక బ్యాటర్ గా కూడా వార్న్ రాణించాడు. తన టెస్టు కెరీర్ లో 3,154 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 99. సెంచరీ చేయకుండా 3 వేలకు పైగా పరుగులు చేసిన క్రికెటర్ వార్న్.
