దేశవాళీ దిగ్గజం ముంబైదే స్మాట్ టైటిల్.. ఉత్కంఠ మ్యాచ్‌లో రాణించిన సర్ఫరాజ్
SMAT 2022: దేశవాళీ క్రికెట్ లో దిగ్గజ జట్టుగా గుర్తింపు దక్కించుకున్న ముంబై కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇప్పటివరకు ఆ జట్టు నెగ్గని సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) ను ఈ ఏడాది దక్కించుకుంది.
సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీ (స్మాట్) బెంగను దేశవాళీ దిగ్గజం ముంబై తీర్చుకుంది. పదుల సంఖ్యలో రంజీ ట్రోఫీలు, మరెన్నో ఇతర టోర్నీలు నెగ్గిన ముంబై క్రికెట్ జట్టుకు స్మాట్ టైటిల్ లేని లోటు ఉండేది. కానీ శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన ఫైనల్ లో ముంబై.. హిమాచల్ ప్రదేశ్ ను ఓడించి తొలి టైటిల్ ను చేజిక్కించుకుంది. గత కొంతకాలంగా ముంబై బ్యాటింగ్ కు వెన్నెముకలా ఉన్న సర్ఫరాజ్ ఖాన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కోల్కతా వేదికగా ముగిసిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో ఏకాంత్ సేన్ (29 బంతుల్లో 37, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.
ఓపెనర్లు ప్రశాంత్ చోప్రా (19), అంకుశ్ బైన్స్ (4), సుమీత్ వర్మ (8), నిఖిల్ గంగ్ట (22), కెప్టెన్ రిషి ధావన్ (1) లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లు మోహిత్ అవస్తి, తనుష్ కొటైన్ తలా మూడు వికెట్లతో హిమాచల్ ప్రదేశ్ కు బోల్తా కొట్టించారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై కూడా హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే తడబడింది. ఓపెనర్ పృథ్వీ షా (11) తో పాటు కెప్టెన్ అజింక్యా రహానే (1) త్వరగానే నిష్క్రమించారు. కానీ వన్ డౌన్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (27), శ్రేయాస్ అయ్యర్ (34) రాణించారు. వీళ్లిద్దరూ ముంబై ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. కానీ ఈ ఇద్దరూ త్వరగానే నిష్క్రమించారు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే గాక ముంబైకి విజయంలో కీలక పాత్ర పోషించాడు. హిమాచల్ ప్రదేశ్ ను తక్కువ పరుగులు చేయడంలో సఫలమైన బౌలర్.. తనుష్ కొటైన్.. చివరి ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టి ముంబై విజయాన్ని ఖాయం చేశాడు.
2006 నుంచి ఈ ట్రోఫీని నిర్వహిస్తుండగా.. తొలిసారి తమిళనాడు విజేతగా నిలిచింది. 2009-10లో మహారాష్ట్ర, 2010-11లో బెంగాల్, 2011-12లో బరోడా, 2012-13లో గుజరాత్, 2014-15లో గుజరాత్, 2015-15లో ఉత్తరప్రదేశ్ గెలిచాయి. 2016-17లో ఈస్ట్ జోన్, 2017-18 సీజన్ లో స్మాట్ ట్రోఫీని ఢిల్లీ గెలవగా ఆ తర్వాత వరుసగా కర్నాటక (రెండుసార్లు), తమిళ్ నాడు (రెండు సార్లు) నెగ్గాయి. ముంబై ఈ టోర్నీలో ఫైనల్ కు వెళ్లడం కూడా ఇదే ప్రథమం కావడం గమనార్హం.