హాఫ్ సెంచరీ చేసి అవుటైన సంజూ శాంసన్... 8 పరుగులు చేసి పెవిలియన్ చేరిన రుతురాజ్ గైక్వాడ్.. భారీ స్కోరు దిశగా టీమిండియా..
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సంజూ శాంసన్, హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. 223 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గిల్- ఇషాన్ కిషన్ జోడి... వెస్టిండీస్‌లో టీమిండియాకి అతి పెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు..
2017లో అజింకా రహానే, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి 132 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ రికార్డును బ్రేక్ చేసిన శుబ్‌మన్ గిల్- ఇషాన్ కిషన్ జోడి, ఓవరాల్‌గా రెండో బెస్ట్ పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఇంతకుముందు 2007 వరల్డ్ కప్‌లో సెహ్వాగ్-గంగూలీ కలిసి బర్మోడాపై రెండో వికెట్‌కి 202 పరుగుల భాగస్వామ్యం అందించారు.
వరుసగా మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసిన సంజూ శాంసన్, వన్డేల్లో మూడో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
33 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది టీమిండియా. 74 బంతుల్లో 1 ఫోర్లతో 77 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.
వెస్టిండీస్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొట్టమొదటి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. ఇంతకుముందు వరుసగా రెండు సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ధోనీ రికార్డును ఇషాన్ కిషన్ అధిగమించాడు. ఓవరాల్‌గా వెస్టిండీస్ గడ్డ మీద ధోనీ, మూడు సార్లు 50+ స్కోర్లు సాధిస్తే, ఇషాన్ కిషన్ ఆ ఫీట్‌ని సమం చేసేశాడు..
వన్డే సిరీస్‌లో మూడు వన్డేలోనూ 50+ స్కోర్లు చేసిన ఆరో భారత బ్యాటర్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. కృష్ణమాచారి శ్రీకాంత్ 1982లో శ్రీలంకపై ఈ ఫీట్ సాధిస్తే, 1985లో దిలీప్ వెంగ్‌సర్కార్, 1993లో మహ్మద్ అజారుద్దీన్ కూడా శ్రీలంకపైనే హ్యాట్రిక్ 50+ స్కోర్లు సాధించారు. 2019లో మహేంద్ర సింగ్ ధోనీ, ఆస్ట్రేలియాపై ఈ ఫీట్ సాధిస్తే, 2020లో శ్రేయాస్ అయ్యర్, న్యూజిలండ్‌పై హ్యాట్రిక్ 50+ స్కోర్లు చేశాడు.
మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్, 51 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వెస్టిండీస్ టూర్‌లో వరుసగా విఫలమవుతున్న గిల్‌కి ఇది ఊరటనిచ్చే అర్ధశతకం.
