కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలా ఈ మహమ్మారికి బలైన వారిలో సెలబ్రెటీలు కూడా ఉన్నారు. కాగా ఈ జాబితాలో ఇప్పుడు మరో ప్రముఖులు చేరారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రాణ స్నేహితుడు ఒకరు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

అతడు కూడా క్రికెటరే కావడం గమనార్హం. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విజయ్ షిర్కే 80 వ దశకంలో సుంగ్రెస్ మాఫట్లాల్ జట్టుకు క్రికెట్ ఆడాడు. ఈ జట్టులో సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి కూడా ఆడారు. 

తన స్నేహితుడి మరణంపై వినోద్ కాంబ్లీ స్పందించారు. " ఎంతో విషాదకరమైన వార్త. నా ప్రాణ స్నేహితుణ్ని కోల్పోవడం ఎంతో బాధాకరం. అతన్ని నేను, సచిన్ విజ్జా అని ముద్దుగా పిలిచేవాళ్లం " అని ఆవేదన వ్యక్తం చేశాడు.

" విజయ్ షిర్కే మంచి ఫాస్ట్ బౌలర్. మేం ఆడుకునే రోజుల్లో అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. వారం రోజుల క్రితమే అతనితో మాట్లాడాను. కానీ మూడు రోజుల నుంచి నాకు అతని నుంచి మెసేజ్ లు రావడం లేదు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చిందని" బాధ పడ్డాడు.