లంకను ఓడించిన నమీబియా.. ‘నామ్ యాద్ రఖ్నా’ అంటూ సచిన్ ఆసక్తికర ట్వీట్..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ ఎలా ఉండబోతుందో క్వాలిఫై రౌండ్ లోనే రుచి చూపిస్తూ ఆసియా కప్ నెగ్గిన శ్రీలంక క్రికెట్ జట్టుకు అనామక జట్టుగా బరిలోకి దిగిన నమీబియా షాకిచ్చింది.
క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరు. అందుకు దీనిని ‘జెంటిల్మెన్ గేమ్’ అని వ్యవహరిస్తారు క్రికెట్ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా టీ20లలో అయితే ఎవరు గెలుస్తారని అంచనా వేయడం చాలా కష్టం. క్షణాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చేసే ఆటగాళ్లు కోకొల్లలుగా ఉన్నారు. అనామకులు అనుకున్న జట్టే అగ్రజట్లకు షాకులిస్తున్నాయి. అలాంటి జాబితాలోనే చేరింది నమీబియా.
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022 అర్హత రౌండ్ లోనే లంకకు భారీ షాకిచ్చింది. గ్రూప్ ఏ లో భాగంగా శ్రీలంక - నమీబియా మధ్య జరిగిన క్వాలిఫై రౌండ్ తొలి మ్యాచ్ లో.. లంకేయులకు ఓటమి తప్పలేదు. 55 పరుగుల తేడాతో నమీబియా గెలుపు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. నమీబియాను ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
మ్యాచ్ తర్వాత సచిన్ తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఈరోజు నమీబియా క్రికెట్ ప్రపంచానికి తన పేరు గుర్తుంచుకోమని ఘనంగా చాటి చెప్పింది..’ (ఇంగ్లీష్ లో నమీబియాలోని మొదటి మూడు అక్షరాలను తీసుకుని ‘నామ్ యాద్ రఖ్నా’ అని రాసుకొచ్చాడు) అని ట్వీట్ చేశాడు. నమీబియా చాలా బాగా ఆడిందని మాస్టర్ బ్లాస్టర్ కొనియాడాడు.
మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన నమీబియా.. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 95 పరుగులే చేసింది. కానీ దు చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు స్కోరు రాకెట్ స్పీడ్ లా పరిగెత్తింది. 30 బంతుల్లో ఆ జట్టు 68 పరుగులు చేసింది. ఆ జట్టులో జాన్ ఫ్రైలింక్ (28 బంతుల్లో 44, 4 ఫోర్లు), స్మిత్ ( 16 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్నీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
మోస్తారు లక్ష్య ఛేదనలో లంక బ్యాటింగ్ కకావికలమైంది. బ్యాటింగ్ లో రాణించిన ఫ్రైలింక్ బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు తీశాడు. అతడితో పాటు షికొంగొ, స్కాల్ట్జ్, వీస్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా లంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. దీంతో నమీబియా 55 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇక యూఏఈ, నెదర్లాండ్స్ లో జరిగే రెండు మ్యాచ్ లలో ఏ ఒక్కటి గెలిచినా ఆ జట్టు సూపర్-12కు అర్హత సాధిస్తుంది.