ఐపీఎల్ 2021 సీజన్ లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ నాలుగు మ్యాచుల్లో ఎక్కువగా సోమవారం జరిగిన మ్యాచ్ గురించే చర్చ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరు చాలా ఆసక్తికరంగా సాగింది. సంజు శాంసన్ ఒంటరి పోరాటం నెటిజన్లను , క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

నిన్నటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ సెంచరీతో చెలరేగిపోయాడు. పంజాబ్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 222 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ టీమ్‌ని సంజు శాంసన్ (119: 63 బంతుల్లో 12x4, 7x6) చివరి బంతి వరకూ ముందుండి నడిపించాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో ఆఖరికి పంజాబ్ టీమ్ 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి బంతికి రాజస్థాన్ విజయానికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టబోయిన సంజు శాంసన్.. బౌండరీ లైన్ వద్ద దీపక్ హుడా చేతికి చిక్కాడు.

ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే బెన్‌స్టోక్స్ (0) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ నుంచే టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. టార్గెట్‌ భారీగా ఉన్నా.. ఏ మాత్రం తడపడకుండా ఆడాడు. హచరుల నుంచి పెద్దగా సపోర్ట్ లభించకపోయినా.. కెప్టెన్‌గా చివరి బంతి వరకూ అతను పోరాడిన తీరుకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న సంజు శాంసన్.. ఆ తర్వాత 21 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ని చేరుకోడం విశేషం. మొత్తంగా12 ఫోర్లు, 7 సిక్సులు కొట్టడం విశేషం.

అయితే.. చివరి ఓవర్లో.. రెండు బంతుల్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి బంత్ సిక్స్ కొడితే.. జట్టు కి విజయాన్ని అందించొచ్చనే ప్రయత్నంలో.. అవుట్ అయిపోయాడు.  అయినప్పటికీ ఆ సమయంలో సంజు తీసుకుంది సరైన నిర్ణయం కాదేమోనని.. తన తోటి క్రికెటర్ మోరిస్ ని నమ్మి.. సింగిల్ తీసి ఉంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానించారు. సంజు సింగిల్ తీసి ఉంటే.. ఆ తర్వాత మోరిస్.. ఫోర్ కొట్టి ఉండేవాడేమో అంటూ కొందరు ట్వీట్ చేయడం గమనార్హం.