రోహిత్ శర్మ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేయడంతో పాటు తన పేరిట మరెన్నో రికార్డులను లిఖించుకున్న హిట్ మ్యాన్ వద్ద ఒక్క బ్యాట్ కూడా లేదట.

ఏకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వున్న రోహిత్ శర్మ వద్ద బ్యాట్ లేకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే ఐపీఎల్ 2020కి సంబంధించి డ్రీమ్ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ స్పాన్సర్‌గా వివో తప్పుకోవడంతో ఏడాది కాలానికి గాను రూ.250 కోట్లతో డ్రీమ్ లెవెన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13 సీజన్ కోసం పలువురు క్రిటెటర్లతో డ్రీమ్ లెవన్ ప్రమోషనల్  వీడియోలు రూపొందిస్తుంది.

దీనిలో భాగంగా రోహిత్ శర్మ వీడియో ఒకటి విడుదల చేసింది. సదరు వీడియోలో రోహిత్ గల్లీలో క్రికెట్ ఆడుతుంటాడు. చేతిలో బ్యాట్ పట్టుకుని హిట్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న రోహిత్‌ వద్దకు ఓ వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతాడు.

దీనికి తాను  ఓపెనింగ్ చేస్తున్నా అంటూ హిట్ మ్యాన్ బదులిస్తాడు. ఎంతైనా తాను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ను అంటూ నవ్వుతూ పేర్కొంటాడు. అయితే ఆ వ్యక్తి నీ చేతిలో ఉన్న బ్యాట్ ఎవరిది అని అడుగుతాడు.

దానికి రోహిత్ తడబడుతూ.. ఇది నీదేనా అని ప్రశ్నిస్తాడు. వెంటనే అవతలి వ్యక్తి రోహిత్ చేతిలో ఉన్న బ్యాట్‌ను లాక్కుని... ఇది నా బ్యాట్ అని నువ్వెళ్లి నీ సొంత బ్యాట్ తెచ్చుకో, అప్పటి వరకు ఫీల్డింగ్ చేయ్ అని పక్కకు నెట్టేస్తాడు. దీంతో రోహిత్ బిత్తరచూపులు చూస్తుండగా వీడియో ముగుస్తుంది.

సదరు వీడియోను ముంబై బౌలర్ బుమ్రా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. రోహిత్ బాయ్.. అది మన క్రికెట్ కాదు.. గల్లీ క్రికెట్, నీ సొంత బ్యాట్ తెచ్చుకుని బరిలోకి దిగు అంటూ కామెంట్ చేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.