ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు, వైఎస్ కెప్టెన్ రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. 

ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆటగాడు, వైఎస్ కెప్టెన్ రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఐపీఎల్-12లో భాగంగా బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ కోసం ముంబై వాంఖేడే స్టేడియంలో రోహిత్ సాధన చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తూ డైవ్ చేస్తుండగా అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో రోహిత్ నొప్పితో విలవిల్లాడాడు.. దీనిని గమనించిన ముంబై ఇండియన్స్ ఫిజియో నితిన్ పటేల్ వెంటనే అతనిని మైదానం నుంచి తీసుకెళ్లాడు.

రోహిత్‌కు పెద్ద గాయమే అయినట్లుగా సమాచారం. అతను కోలుకోవడానికి కనీసం రెండు నుంచి ఆరువారాల విశ్రాంతి అవసరమవుతుందని తెలుస్తోంది. మరోవైపు ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఏప్రిల్ 15న బీసీసీఐ ప్రకటించనుంది.

మే 30 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఆడనుంది. కాగా రోహిత్ గాయంపై ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

2015 ప్రపంచకప్ సమయంలోనూ రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. దీంతో ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కానీ భారత జట్టు సెమీ ఫైనల్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.