ఈ మధ్యకాలంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు పెద్దగా వినబడడం లేదు. తాజాగా రిషబ్ పంత్ తనకు బాటింగ్ న్హాగస్వామిగా మహేంద్ర సింగ్ ధోని అంటే ఇష్టమని మంగళవారం నాడు వ్యాఖ్యానించాడు. 

ధోని బాటింగ్ చేసేప్పుడు ఒక ప్లాన్ ప్రకారంగా పూర్తి ప్రణాలికను రచిస్తాడని, అవతలివైపు ఉన్న బ్యాట్స్ మెన్ కేవలం ధోని సలహాలు,సూచనలను పాటిస్తే   సరిపోతుందని అన్నాడు పంత్. 

ధోనితో బ్యాటింగ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయని, కానీ వచ్చిన అన్ని అవకాశాలను పూర్తిగా ఆస్వాదిస్తానని అన్నాడు. ధోనితో బ్యాటింగ్ చేసేప్పుడు తన మనసులో ఎటువంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదని, ధోని అన్ని ప్లాన్ చేసి పెడ్తాడు కాబట్టి వెళ్లి ఆటను ఆస్వాదించడమే అని ట్విట్టర్ లో జరిగిన ఒక చాట్ లో వెల్లడించాడు పంత్. 

ధోనీతోపాటుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ శ్రేయస్ అయ్యర్ లతో కూడా బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు పంత్. సీనియర్లతో ఆడుతున్నప్పుడు వారి మైండ్ సెట్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని, ఆటపాటల వారి కోణం పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు పంత్. ఐపీఎల్ లో శిఖర్, అయ్యర్ లతో ఆడినప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుందని అన్నాడు పంత్. 

ఇకపోతే పంత్ ను ఉపయోగించుకోవడంలో టీం ఇండియా విఫలమైందని అన్నాడు టీం ఇండియా మాజీ ప్లేయర్ కైఫ్. పంత్ ని ఫినిషర్ గా చూస్తున్నవారందరూ... పంత్ కి ఒక పది ఓవర్లు ఆడే అవకాశం కల్పించాలని, అలా కల్పించినప్పుడే అతడిలోని టాలెంట్ బయటకొస్తుందని అన్నాడు కైఫ్. అందుకోసమే పంత్ ను పూర్తిస్థాయిలో టీమిండియా వినియోగించుకోలేకపోతుందని అన్నాడు.