2022 డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్... గాయాలతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన రిషబ్ పంత్! వచ్చే సీజన్‌లో కూడా కష్టమేనంటున్న సౌరవ్ గంగూలీ.. 

టీమిండియాలో స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే కారు ప్రమాదానికి గురయ్యాడు రిషబ్ పంత్. 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు..

కారు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతను మరో ఆరు లేదా ఏడు నెలల్లో క్రికెట్‌లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇదే మాట చెప్పాడు. తాను రిషబ్ పంత్‌తో మాట్లాడానని, అతని ఉత్సాహం చూస్తుంటే మరో ఆరేడు నెలల్లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడని చెప్పాడు శిఖర్ ధావన్...

అయితే టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం రిషబ్ పంత్ రీఎంట్రీకి రెండేళ్ల సమయం పడుతుందని బాంబ్ పేల్చాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు తీసుకున్నాడు సౌరవ్ గంగూలీ...

ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ పంత్ రీఎంట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు సౌరవ్ గంగూలీ..

‘రిషబ్ పంత్‌తో నేను రెండు మూడు సార్లు మాట్లాడాను. అతను ఇప్పుడు చాలా కష్ట సమయంలో ఉన్నాడు. గాయాలతో, సర్జరీలతో నొప్పిని భరిస్తున్నాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా..

అతను టీమిండియా తరుపున ఆడడానికి ఏడాదికి పైగా సమయం పడుతుంది. మరో రెండేళ్లు పట్టినా పట్టొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గగూలీ.. 

రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడడంతో అతన్ని రిప్లేస్ చేసే వికెట్ కీపర్ కోసం చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. 2022 సీజన్‌లో తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌ని వేలంలో కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, అతన్ని రెండే రెండు మ్యాచుల్లో ఆడించి 2023 వేలానికి విడుదల చేసింది. అతను ఉండి ఉంటే రిషబ్ పంత్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి వికెట్ కీపింగ్ బ్యాటర్ అయ్యేవాడు...

అయితే ఇప్పుడు కూడా ఢిల్లీ టీమ్‌లో ఇద్దరు వికెట్ కీపింగ్ బ్యాటర్లు ఉన్నారు. దేశవాళీ టోర్నీల్లో అపార అనుభవం ఉన్న షెల్డన్ జాక్సన్‌తో పాటు యంగ్ కీపర్ అభిషేక్ పోరెల్‌ని ఐపీఎల్ 2023 వేలంలో కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.. అయితే ఈ ఇద్దరిలో ఎవ్వరిని ఆడించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని తెలిపాడు సౌరవ్ గంగూలీ...

‘ఐపీఎల్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపు మొదలెడతాం. ఈ క్యాంపులో రిషబ్ పంత్‌ ప్లేస్‌ని రిప్లేస్ చేసే వికెట్ కీపర్‌ని డిసైడ్ చేస్తాం. ఐపీఎల్‌కి ఇంకా ఓ నెల సమయం ఉంది. కొందరు ప్లేయర్లు టీమిండియా ఆడుతున్నారు. మరికొందరు ఇరానీ ట్రోఫీలో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ వేలికి గాయమైంది, అయితే ఆ గాయం అంత తీవ్రమైనదేమీ కాదు. ఐపీఎల్ సమయానికి కోలుకుంటాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ..

రిషబ్ పంత్ గైర్హజరీలో ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి ఐపీఎల్ టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, ఢిల్లీ టైటిల్ ఆశలు తీరుస్తాడని బోలెడు ఆశలు పెట్టుకుంది టీమ్ మేనేజ్‌మెంట్..