చెన్నై టెస్టులో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. 88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91 పరుగులు చేసిన రిషబ్ పంత్... డామ్ బెస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, జాక్ లీచ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 225 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఇంకా ఇంగ్లాండ్ స్కోరుకి 353 పరుగులు వెనకబడి ఉంది భారత జట్టు.

రిషబ్ పంత్ వికెట్, బెస్‌కి నాలుగో వికెట్ కావడం విశేషం. గత  ఏడు టెస్టుల్లో నాలుగోసారి 90ల్లో అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. వాషింగ్టన్ సుందర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు మూడో సెషన్‌లో పూజారా, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయిన టీమిండియా... మరో వికెట్ కోల్పోతే భారత జట్టు కష్టాల్లో పడే అవకాశం ఉంది.

ఫాలోఆన్ నుంచి తప్పించుకోవాలంటే భారత జట్టు 378 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్కోరు చేయడం కష్టమేనని అనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌ వికెట్లు కోల్పోతే, టెయిలెండర్లు ఎంతవరకూ పోరాడతారనేది అనుమానమే.