Asianet News TeluguAsianet News Telugu

రిషబ్ పంత్ సెంచరీ మిస్! శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ... ఆధిక్యంలోకి టీమిండియా...

93 పరుగులు చేసి అవుటైన రిషబ్ పంత్... శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఐదో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్... తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి టీమిండియా.. 

Rishabh Pant missed Century, Shreyas Iyer half century, Team India leading in 2nd test
Author
First Published Dec 23, 2022, 2:43 PM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిక్యం సంపాదించింది. టాపార్డర్ వైఫల్యంతో 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కలిసి ఆదుకున్నారు. 

స్పిన్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై రిషబ్ పంత్ సిక్సర్లతో విరుచుకుపడగా, శ్రేయాస్ అయ్యర్ కూడా దూకుడుగా బౌండరీలు బాదాడు. వీరిద్దరి బాదుడు కారణంగా రెండో సెషన్‌లో 140 పరుగులు చేసి ఒకే వికెట్ కోల్పోయింది భారత జట్టు.

శ్రేయాస్ అయ్యర్ కెరీర్‌లో ఐదో టెస్టు హాఫ్ సెంచరీ అందుకోగా రిషబ్ పంత్ 93 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ 90ల్లో అవుట్ కావడం ఇది ఆరోసారి. 

రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 105 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 93 పరుగులు చేసిన రిషబ్ పంత్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

రిషబ్ పంత్ అవుటయ్యే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులతో క్రీజులో ఉన్నాడు.. 

 19/0 ఓవర్‌నైట్ స్కోరుతో  రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కెఎల్ రాహుల్ 10 పరుగులు చేసి అవుట్ కాగా, తొలి టెస్టు సెంచరీ హీరోలు శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా కూడా స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు.

ఓపెనర్లు ఇద్దరినీ త్వరగా కోల్పోయింది. 45 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా..

ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు తైజుల్ ఇస్లాం. 39 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు...

55 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మోమినుల్ పట్టిన అద్భుత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. టెస్టుల్లో 7 వేల పరుగులు అందుకున్న ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

డాన్ బ్రాడ్‌మన్ 6997 పరుగులను అధిగమించిన ఛతేశ్వర్ పూజారా.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ తర్వాత టెస్టుల్లో 7 వేలకు పైగా పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు.

రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది భారత జట్టు. లంచ్ బ్రేక్ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది టీమిండియా. 73 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో నురుల్ హసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌, తొలి ఇన్నింగ్స్‌లో 73.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 227 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఉమేశ్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.. మోమినుల్ హక్  84 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios