ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలో రిషబ్ పంత్‌కి సర్జరీ... పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలల దాకా సమయం పడుతుందని అంచనా... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ 2023కి దూరమైన రిషబ్ పంత్.. 

గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. రిషబ్ పంత్‌ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు... శనివారం రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు...

రిషబ్ పంత్‌కి నిర్వహించిన సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా ముగిసిందని, అతను త్వరగా కోలుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు తెలియచేశాయి. కారు ప్రమాదంలో రిషబ్ పంత్‌ తలకు, మోకాలికి, మోచేతులకు, వీపు భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి.. 

పంత్ నుదిటకు రెండు కాట్లు పడడంతో అక్కడ ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు వైద్యులు. తొలుత ఢిల్లీలోని సాక్ష్యం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రిషబ్ పంత్, ఆ తర్వాత డెహ్రాడూన్‌లో మ్యాక్స్ ఆసుపత్రికి మార్చబడ్డాడు...

మ్యాక్స్ ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఎయిర్ అంబులెన్స్ ద్వారా రిషబ్ పంత్‌ని ముంబైకి తరలించింది బీసీసీఐ. ప్రస్తుతం బీసీసీఐ పర్యవేక్షణలోనే రిషబ్ పంత్‌కి చికిత్స జరుగుతోంది. మోకాలికి శస్త్ర చికిత్స ముగియడంతో అతను తిరిగి మామూలుగా స్థితికి రావడానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని అంచనా...

యాక్సిడెంట్ కారణంగా రిషబ్ పంత్, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు. వన్డే, టీ20ల్లో రిషబ్ పంత్‌కి పోటీగా చాలామంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నా, టెస్టుల్లో రెండేళ్లుగా కీలక సభ్యుడిగా మారిపోయాడు ఈ యంగ్ వికెట్ కీపర్. గబ్బా టెస్టులో వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా చారిత్రక విజయాన్ని అందించిన రిషబ్ పంత్, కేప్‌ టౌన్‌ టెస్టులో సెంచరీ బాదాడు...

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023 సీజన్‌కి కూడా రిషబ్ పంత్ దూరమయ్యాడు. గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ దూరం కావడంతో అతని ప్లేస్‌లో కొత్త కెప్టెన్‌ని వెతికే బాధ్యత మేనేజ్‌మెంట్‌పై పడింది. వచ్చే జూలై నెలలో లండన్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తాడని కథనాలు వినిపిస్తున్నాయి...

జూలైలో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలంటే వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో కనీసం రెండు టెస్టులు గెలవాల్సి ఉంటుంది టీమిండియా. అయితే రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నా, మునుపటి ఫిట్‌నెస్ సాధించడం అంత తేలికైన విషయం కాదని అంటున్నారు. రిషబ్ పంత్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ సమయానికైనా జట్టుకి అందుబాటులోకి రాగలడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...