Asianet News TeluguAsianet News Telugu

Irani Cup: రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ ట్రోఫీ.. ఫైనల్లో సౌరాష్ట్రపై ఈజీ విక్టరీ

Irani Cup 2022: దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన ఇరానీ కప్ -2022 ట్రోఫీని  రెస్టాఫ్ ఇండియా దక్కించుకుంది.  సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో  హనుమా విహారి సారథ్యంలోని  రెస్టాఫ్ ఇండియా.. 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 
 

Rest Of India Beat Saurashtra By 8 Wickets and Clinch Irani Cup 2022 Trophy
Author
First Published Oct 4, 2022, 4:06 PM IST

ఇరానీ కప్-2022 విజేతగా  రెస్టాఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో ముగిసిన  మ్యాచ్ లో   హనుమా విహారి సారథ్యంలోని రెస్టాఫ్ ఇండియా.. 8 వికెట్ల తేడాతో  విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.  లక్ష్య ఛేదనలో రెస్టాఫ్ ఇండియా ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (78 బంతుల్లో 63 నాటౌట్,  9 ఫోర్లు), కోన శ్రీకర్ భరత్ (82 బంతుల్లో 27 నాటౌట్, 5 ఫోర్లు)  రాణించి  ఆ జట్టుకు విజయాన్నిఅందించారు. రెస్టాఫ్ ఇండియాకు ఇది  29వ ఇరానీ కప్ కావడం గమనార్హం. 

మ్యాచ్ విషయానికొస్తే.. రాజ్‌కోట్ వేదికగా జరిగిన  మ్యాచ్ లో  సౌరాష్ట్ర  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 24.5 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ఎంపికైన ముఖేశ్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా  కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ లు తలో  మూడు వికెట్లు తీశారు. 

తొలి ఇన్నింగ్స్ లో రెస్టాఫ్ ఇండియా  374 పరుగులకు ఆలౌటైంది. రెస్టాఫ్ ఇండియాలో కెప్టెన్ హనుమా విహారి (82),సర్ఫరాజ్ ఖాన్ (138) లతో పాటు  సౌరభ్ కుమార్ (55), జయంత్ యాదవ్ (37) లు రాణించారు. సౌరాష్ట్ర తరఫున చేతన్ సకారియా.. 5 వికెట్లు తీశాడు. 

 

అనంతరం రెండో ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర.. 380 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు తరఫున జాక్సన్ (71) వసవడ (55), ప్రేరణ్ మాన్కడ్ (72) ఉనద్కత్ (89)  లు రాణించారు. ఫలితంగా సౌరాష్ట్ర 104  పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. 

104 పరుగుల లక్ష్య ఛేదనలో రెస్టాఫ్ ఇండియా.. 31.2 ఓవర్లలో విజయాన్నిఅందుకుంది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్  (2),  యశ్ ధుల్ (8) త్వరగానే ఔటైనా  అభిమన్యు ఈశ్వరన్,  శ్రీకర్ భరత్ లు నిలిచి విజయాన్ని అందించారు.  రెస్టాఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ ట్రోఫీ కావడం విశేషం.  

 

Follow Us:
Download App:
  • android
  • ios