ఆర్సీబీకి పట్టిన గతే మీకూ.. లక్నో టీమ్పై ఫ్యాన్స్ ఆగ్రహం.. కారణమిదే
IPL 2023: రాబోయే ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పట్టిన గతే పడుతుందని ఆ జట్టు అభిమానులు వాపోతున్నారు.

మరికొద్దిరోజుల్లో ఐపీఎల్ - 16వ ఎడిషన్ మొదలుకానుంది. ఈ లీగ్ కోసం ఇదివరకే అన్ని జట్లూ సన్నాహక శిబిరాలు ఏర్పాటుచేసి పలువురు క్రికెటర్లకు శిక్షణనిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంతవరకూ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గని ఆర్సీబీ.. గతేడాది ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ సీజన్ ఆరంభానికి 8 రోజుల ముందు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకున్న నిర్ణయం ఆ జట్టు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నది.
ఇప్పటికే లక్నో జట్టు తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. తాజాగా లక్నో టీమ్.. ‘రాయల్ ఛాలెంజర్’ (ఆర్సీబీ మాతృ సంస్థ) ను అధికారిక స్పాన్సర్ గా ప్రకటించింది. ఈ సీజన్ లో లక్నో టీమ్ కు రాయల్ ఛాలెంజర్ అధికారిక స్పాన్సర్ గా వ్యవహరించనుందని ఈ మేరకు ట్వీట్ కూడా చేసింది.
ఎల్ఎస్‌జీ ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే లక్నో ఫ్యాన్స్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో ఐరెన్ లెగ్ టీమ్ అయిన ఆర్సీబీని అధికారిక స్పాన్సర్ గా నియమించడమేంటని నిలదీస్తున్నారు. ఇలా చేస్తే రాబోయే సీజన్ లో లక్నో.. ఆర్సీబీతో ఆడబోయే ప్రతీ మ్యాచ్ లోనూ ఓడిపోక తప్పదని కామెంట్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లక్నో తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ జట్టు అభిమానులు స్పందిస్తూ.. ‘అంటే ఇక లక్నో కూడా ఆర్సీబీ మాదిరిగానే ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా కొట్టదా..? ఓరి దేవుడా.. ఇదేం ఖర్మ ’, ‘రాయల్ ఛాలెంజర్ వచ్చిందంటే దానర్థం ఈసారి కూడా మన(లక్నో)కు ట్రోఫీ గోవిందా అన్నమాటే..’, ‘మీ ప్లేస్ (లక్నో ఫ్రాంచైజీ) ప్లేస్ లో నేనుంటే గనక ఈ నిర్ణయానికి అస్సలు మద్దతిచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఐపీఎల్ లో గెలుపు దగ్గరికి వచ్చేసరికి ఆర్సీబీ కి ఉన్న హిస్టరీ ఏంటో తెలుసుకుంటే మంచిది. లక్నో పట్ల ఆందోళనగా ఉంది..’, ‘అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక ఆ (ఆర్సీబీ) టీమ్ మాదిరిగానే లక్నో కూడా ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా గెలవదా...?’అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా ఐపీఎల్ -16లో భాగంగా కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్.. ఏప్రిల్ ఒకటిన లక్నోలోని ఏకనా స్టేడియంలో తమ తొలి మ్యాచ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీ.. అదే రోజు ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది..