గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కి దూరంగా ఉన్న రవీంద్ర జడేజా... ‘పుష్ఫ’ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ వీడియో విడుదల చేసిన జడ్డూ...
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కథానాయకుడిగా, ‘లెక్కల మాస్టర్’ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ఫ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన సినిమాకు తెలుగులో కంటే మిగిలిన భాషల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏపీలో టికెట్ల రేట్లు ఘోరంగా తగ్గించినా, టికెట్ బుకింగ్ యాప్స్‌లో థియేటర్ల సీట్లు మొత్తం ఖాళీగా చూపిస్తున్నా... కలెక్షన్ల వర్షం మాత్రం తగ్గడం లేదని అంటోంది చిత్ర యూనిట్...
కలెక్షన్ల విషయం పక్కనబెడితే, ఈ సినిమాలో ‘పుష్ఫరాజ్’ పాత్రలో అల్లుఅర్జున్ చూపించిన మేనేరిజం, అందరికీ తెగ నచ్చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అల్లుఅర్జున్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తూ ‘రీఫేస్’ యాప్‌తో రూపొందించిన ఓ వీడియోను పోస్టు చేసిన విషయం తెలిసిందే...
మూవీ విడుదలకు ముందు సరైన ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ భయపడుతున్న సమయంలో డేవిడ్ వార్నర్ ఈ వీడియో విడుదల చేయడం, ఈ వీడియోకి విరాట్ కోహ్లీ కామెంట్ చేయడంతో వరల్డ్ వైడ్‌గా కావాల్సినంత పబ్లిసిటీ జరిగిపోయింది...
తాజాగా భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ‘పుష్ఫ’ లో అల్లుఅర్జున్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘పుష్ఫ... పుష్ఫరాజ్... నీ యవ్వ తగ్గేదేలే...’ అంటూ గడ్డాన్ని స్టైల్‌గా పైకంటూ అల్లుఅర్జున్ స్టైల్‌ని దింపేశాడు రవీంద్ర జడేజా...
ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే 10 లక్షలకు పైగా లైక్స్ రాగా, వేలల్లో కామెంట్లు వచ్చేశాయి. రవీంద్ర జడేజా తెలుగు సినిమా వీడియో చేయడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు టాలీవుడ్ అభిమానులు...
న్యూజిలాండ్‌తో కాన్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో గాయపడిన రవీంద్ర జడేజా, ఆ గాయం కారణంగానే ముంబై టెస్టులో బరిలో దిగలేదు. అతని గాయం మానడానికి సమయం పడుతుందని వైద్యులు నిర్ధారించడంతో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కి కూడా దూరమయ్యాడు రవీంద్ర జడేజా...
ప్రస్తుతం భారత వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో తిరిగి ఫిట్‌నెస్ సాధించడానికి కసరత్తులు చేస్తున్నాడు రవీంద్ర జడేజా. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి జడ్డూ అందుబాటులో ఉంటాడని సమాచారం...
గత కొన్నేళ్లుగా వరుసగా గాయాలతో సతమతమవుతున్న రవీంద్ర జడేజా, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే జడ్డూ ఈ వార్తలను తన స్టైల్‌లో కొట్టి పారేశాడు. ‘లాంగ్ వే టు గో...’ (ఇంకా చాలా దూరం వెళ్లాలి...) అంటూ టెస్టు జెర్సీలో ఉన్న పిక్‌ను షేర్ చేశాడు రవీంద్ర జడేజా.
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ మొదటి రిటెన్షన్‌గా అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రూ.12 కోట్లు అందుకోబోతుంటే, రవీంద్ర జడేజా వచ్చే సీజన్ నుంచి ఏటా రూ.16 కోట్లు తీసుకోబోతున్నాడు...
