ఒకే బంతి కోసం రెండు సార్లు డీఆర్‌ఎస్... డీఆర్‌ఎస్‌ రివ్యూపైన రివ్యూ తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో.. 

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023 ఘనంగా మొదలైంది. మొదటి రోజు మ్యాచ్‌లో సాలెం స్పార్టన్స్ కెప్టెన్ అభిషేక్ తన్వార్, ఒకే బంతికి ఏకంగా 18 పరుగులు సమర్పించిన విషయం తెలిసిందే. రెండో రోజు మరీ విచిత్రంగా ఒకే బంతి కోసం రెండు సార్లు డీఆర్‌ఎస్ కోరుకోవడం హాట్ టాపిక్ అయ్యింది..

పేరుకి ఓ స్టేట్‌లో జరిగే టీ20 లీగ్ అయినా తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) రేంజ్‌ వేరే లెవెల్‌. ఐపీఎల్‌లో ఉండే అన్ని హంగులూ ఇందులో ఉంటాయి. ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించి ఆటగాళ్లను కొనుగోలు చేసే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయర్లు కూడా పాల్గొంటారు..

తాజాగా బాల్‌సీ ట్రిచీతో జరిగిన మ్యాచ్‌లో దుండిగల్ డ్రాగన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బాల్‌సీ ట్రిచీ, 120 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రాజ్‌కుమార్ క్యాచ్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే ఆర్ రాజ్‌కుమార్ వెంటనే డీఆర్‌ఎస్ కోరుకున్నాడు. టీవీ రిప్లైలో బంతి, బ్యాటుకి తగులుతుందా? లేదా? అనేది స్పష్టంగా కనిపించలేదు.

బ్యాటు నేలను తాకినప్పుడు స్పైక్ వస్తుందని భావించిన థర్డ్ అంపైర్, రాజ్‌కుమార్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే థర్డ్ అంపైర్ నిర్ణయంతో అసంతృప్తి చెందిన రవిచంద్రన్ అశ్విన్, మరోసారి డీఆర్‌ఎస్ కోరుకున్నాడు. దీంతో ఇంకోసారి రిప్లై చూసిన థర్డ్ అంపైర్, ముందు తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి రాజ్‌కుమార్‌ని నాటౌట్‌గా ప్రకటించాడు..

అయితే ఒకే బంతికి బ్యాట్స్‌మెన్, బౌలర్ ఇద్దరూ డీఆర్‌ఎస్ కోరుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. డీఆర్‌ఎస్ రివ్యూపైన రివ్యూ కోరిన ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు. అలా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజ్ కుమార్ 22 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

Scroll to load tweet…

బాల్సీ ట్రిచీ 19.1 ఓవర్లలో 120 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ గంగా శ్రీధర్ రాజు 41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా రాజ్‌కుమార్ 39 పరుగులు, షాజహాన్ 13 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు అందరూ 5 పరుగుల స్కోరు కూడా దాటలేకపోయారు..

దుండిగల్ డ్రాగన్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయగా రవిచంద్రన్ అశ్విన్, సుబోత్ భాటి, శరవణ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. ఈ లక్ష్యాన్ని 14.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది దుండిగల్ డ్రాగన్స్. శివమ్ సింగ్ 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేయగా బాబా ఇంద్రజిత్ 22, ఆదిత్య గణేశ్ 20, సుబోత్ భాటి 19 పరుగులు చేశారు.