చెన్నై టెస్టులో ఆరు వికెట్లు తీసిన అశ్విన్... 178 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్...భారత జట్టు టార్గెట్ 420...

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 178 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ టీమ్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 17.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్, 61 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి ఇంగ్లాండ్ జట్టు, టీమిండియాకి 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. షాబజ్ నదీం రెండు వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది.

75వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది 28వ ఐదు వికెట్ల ప్రదర్శన. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఐదు వికెట్లు తీయడం మూడోసారి.