కరోనా దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారిపై పోరులో భారతదేశం సైతం ఇదే బాటలో పయనిస్తూ లాక్ డౌన్ ను మే 31వ తేదీ వరకు పొడిగించింది కూడా. 

ఇక ఇలా లాక్ డౌన్ ను పొడిగించిన వేళ ప్రజలందరినీ ఇంటిపట్టునే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని సెలెబ్రిటీలు పిలుపునిస్తున్నారు. ఇటీవల టీం ఇండియా కోచ్ రవి శాస్త్రి కూడా ప్రజలకు ఈ కరోనా పై పోరులో భాగంగా ఇంట్లోనే ఉంటూ ప్రభుత్వ సూచనలను పాటించాలని, అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చారు. 


తాజాగా.. ఆయన లాక్ డౌన్ లో తాను ఇంట్లో సమయం ఎలా గడుపుతున్నానో చూడండి అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. కాగా.. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోల్లో రవిశాస్త్రి కుక్కలతో సమయం గడుపుతుండటం గమనార్హం.

కాగా.. కుక్కల మధ్య కూడా ఆయన సామాజిక దూరం పాటిస్తుండటం విశేషం. దీంతో.. నెట్టింట దీనిపై జోకులు మొదలయ్యాయి. ఒక ఫోటోలో ఐదు కుక్కల మధ్య లో రవిశాస్త్రి కూర్చొని ఉుండగా.. మరో ఫోటోలో ఒక కుక్క స్టైల్ గా సన్ గ్లాసెస్ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతోంది. దానిని స్కిప్పర్ అంటూ ఆయన పేర్కొనడం విశేషం.

‘సామాజిక దూరం (@ ఐసిసి నిబంధనలను కలుసుకోవడం) లో నాకు డ్రెస్సింగ్ ఇచ్చిన తరువాత, స్కిప్పర్ తనిఖీ చేస్తున్నాడు’’ అంటూ ఆ రెండు ఫోటోలకు క్యాప్షన్ జత చేశాడు. కాగా.. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రవిశాస్త్రి సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేస్తూ ఉంటారు. కాగా.. ఆయన పోస్టులు ఓక్కోసారి బెడిసి కొట్టి.. నెటిజన్ల చేతిలో ట్రోల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టు మీద కూడా ట్విట్టర్ లో జోక్స్ మొదలవ్వడం గమనార్హం.