జార్ఖండ్‌తో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి... క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకోకముందే రాజకీయాల్లో రాణిస్తూ...

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్ స్పోర్ట్స్ మినిస్టర్ సెంచరీ చేశాడు. క్రికెట్‌కి ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించకముందే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బెంగాల్‌లో మంత్రిగా పదవీ బాధ్యతలు కూడా స్వీకరించాడు మనోజ్ తివారి. పశ్చిమ బెంగాల్‌లోని షిబ్‌పూర్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించిన క్రికెటర్ మనోజ్ తివారి, ఐపీఎల్ 2022 మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేయించుకున్నా... ఏ జట్టూ అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...

జార్ఖండ్‌తో జరుగుతున్న మొదటి క్వార్టర్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు మనోజ్ తివారి. తొలి ఇన్నింగ్స్ బెంగాల్ జట్టు 7 వికెట్ల నష్టానికి 773 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్ల దగ్గర్నుంచి బ్యాటింగ్‌కి వచ్చిన ప్రతీ ఒక్క బ్యాటర్ 50+ స్కోర్లు నమోదు చేశారు... 

టాప్ 9 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఇంతకుముందు 129 ఏళ్ల క్రితం ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జీ మధ్య జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో టాప్ 8 బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు బాదగా... ఆ రికార్డును బెంగాల్ బ్రేక్ చేసేసింది...

తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ బ్యాటర్ సుదీప్ గరమి 380 బంతుల్లో 21 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 186 పరుగులు చేయగా అనుస్తుప్ మజుంబర్ 194 బంతుల్లో 15 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. ఓపెనర్లు అభిషేక్ రమన్ 61, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 65, అభిషేక్ పోరెల్ 68, షాబాజ్ అహ్మద్ 78 పరుగులు చేశారు... తొలి ఇన్నింగ్స్‌లో 173 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు మనోజ్ తివారి...

సయన్ మొండల్ 53 పరుగులు చేయగా ఆకాశ్ దీప్ 18 బంతుల్లో 8 సిక్సర్లతో 53 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు... తొలి ఇన్నింగ్స్‌లో 96 ఓవర్లలో 298 పరుగులకి ఆలౌట్ అయ్యింది జార్ఖండ్. నజీం సిద్ధిఖీ 53, సౌరబ్ తివారి 33 పరుగులు చేయగా విరాట్ సింగ్ 239 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగుల భారీ ఆధిక్యం దక్కినా జార్ఖండ్‌ని ఫాలో ఆన్ ఆడించలేదు బెంగాల్. రెండో ఇన్నింగ్స్‌లో అభిషేక్ రమన్ 22, అభిమన్యు ఈశ్వరన్ 13, సుదీప్ కుమార్ 5, అనుస్తుప్ మజుందర్ 38, అభిషేక్ పోరెల్ 34, షాబాజ్ అహ్మద్ 46 పరుగులు చేసి అవుట్ కాగా మనోజ్ తివారి 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు...

దీంతో బెంగాల్, జార్ఖండ్ మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారీ ఆధిక్యంతో సెమీ ఫైనల్‌కి అర్హత సాధించిన బెంగాల్ జట్టు, జూన్ 14న మధ్యప్రదేశ్‌తో మొదటి సెమీస్ ఆడనుంది. ఉత్తరాఖండ్‌ని ఓడించి సెమీస్ చేరిన ముంబై జట్టు, కర్ణాటకను ఓడించి సెమీస్ చేరిన ఉత్తరప్రదేశ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది...

టీమిండియా తరుపున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, వన్డేల్లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ బాదాడు. బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 119 మ్యాచులు ఆడిన మనోజ్ తివారి, 51.78 సగటుతో 8752 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...


ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన మనోజ్ తివారి, చివరిసారిగా 2018 సీజన్‌లో బరిలో దిగాడు.