WTC Finals 2023:  టీమిండియా క్రికెటర్లందరూ ఐపీఎల్ లో బిజీ బిజీగా గడుపుతుంటే  జట్టు హెడ్‌కోచ్   రాహుల్ ద్రావిడ్  మాత్రం మాల్దీవులలో గడుపుతున్నాడు. 

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తర్వాత భారత జట్టు ఆటగాళ్లంతా ఐపీఎల్ కు షిఫ్ట్ అయ్యారు. టెస్టు జట్టులో ఉన్న రోహిత్, కోహ్లీతో పాటు మిగిలిన ఆటగాళ్లంతా వారివారి ఫ్రాంచైజీలకు ఆడుతున్నారు. ఇప్పటికే 18 రోజులుగా జరుగుతున్న ఐపీఎల్ తో వీళ్లంతా బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా ఆటగాళ్లు ఐపీఎల్ లో బిజీగా ఉంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం తనకు దొరికిన రెండు నెలల విరామాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. మాల్దీవులులో వాటర్ గేమ్స్, స్కూబా డైవింగ్ చేస్తూ సేద తీరుతున్నాడు. 

ద్రావిడ్ తన భార్యా పిల్లలతో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవులులో ఉన్నాడు. 50 ఏండ్ల వయసులో కూడా ద్రావిడ్.. బోటు పై నుంచి సముద్రంలోకి దూకడం, స్కూబా డైవింగ్ వంటి సాహస క్రీడలతో తనకు దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రిలాక్స్ అవుతున్నాడు. 

ఫ్లీట్ ఫుట్ అడ్వెంచర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇందుకు సంబంధించిన వీడియోలను పంచుకుంది. గతేడాది వరుస సిరీస్ లతో మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ద్రావిడ్ పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ఉన్నన్ని రోజులు ఫ్యామిలీతో గడిపేందుకు సమయం ఉంటుందని, మిగతా రోజుల్లో టీమిండియాతోనే ఉండేందుకు కృషి చేయాలని చాలా మంది సూచించారు.

Scroll to load tweet…

కాగా ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు జూన్ 7 నుంచి 12 వరకు ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనుంది. ఆ తర్వాత కూడా వరుసగా వెస్టిండీస్ టూర్, ఆసియా కప్, స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ అది ముగిసిన వెంటనే వన్డే వరల్డ్ కప్ ఉన్నాయి. ఈ సిరీస్ లలో జట్టుతో ద్రావిడ్ అందుబాటులో ఉండటం భారత్ కు కీలకం. ఈ నేపథ్యంలో ఖాళీగా దొరికిన సమయాన్ని ద్రావిడ్ ఇలా ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నాడు. 

మాల్దీవుల నుంచి తిరిగొచ్చాక ద్రావిడ్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ముందస్తు సన్నాహకాలపై దృష్టి సారిస్తాడు. ఈ నెలాఖరున గానీ వచ్చే నెలలో గానీ సెలక్షన్ కమిటీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడబోయే జట్టును ఎంపిక చేయనుంది. 2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ కోసం వేచి చూస్తున్న భారత జట్టు.. ఈ ఏడాది దానిని దక్కించుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. 


View post on Instagram