దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. అయితే.. ఇతర దేశాలతో పోలిస్తే లాక్ డౌన్ తో కరోనా ని ఎంతో కొంత అదుపు చేశామనే చెప్పవచ్చు. అయితే... తాజాగా లాక్ డౌన్ ఈ నెల 31వరకు పొడిగించగా.. కొన్ని సడలింపులు చేశారు. ఈ సడలింపుల్లో ప్రేక్షకులు లేకుండా క్రికెట్ ఆడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీంతో త్వరలోనే మన క్రికెటర్లంతా మళ్లీ బ్యాట్ పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 

కాగా.. లాక్ డౌన్ పరిస్థితుల మధ్య క్రికెట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. పరిస్థితులు మామూలుగా మారి.. క్రికెట్ మళ్లీ ప్రారంభమైతే.. కొంతకాలం అనుమానం, భయం ఉంటుందని  రాహుల్ ద్రవిడ్ అన్నారు. 

అభినవ్ బింద్రా, ప్రకాశ్ పదుకొనేలతో నిర్వహించిన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఒకసారి అన్ని ప్రారంభమైన తర్వాత కొంతకాలం వరకూ అందరిలో ఓ భయం, అనుమానం ఉంటుంది. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన బ్రేక్ అసలు సమస్య కాదు. ఒకసారి క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత వెళ్ల పనిని ఎంతో ఇష్టంతో పూర్తి చేస్తారు. అసలు సమస్య ఏంటంటే.. క్రీడాకారుల ఫిట్‌నెస్. ఎందుకంటే గత మూడు నెలలుగా వాళ్లు ఆడటం లేదు’’ అని ద్రవిడ్ అన్నారు.