IPL: ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో తెలుగు హీరోయిన్లు.. బన్నీ భామలకు క్రేజ్ మాములుగా లేదుగా..
IPL 2023: మరో వారం రోజుల్లో మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16 కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభ వేడుకలకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ ఎడిషన్ ఈనెల 31 నుంచి మొదలుకానుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ తో ఈ లీగ్ ఘనంగా ఆరంభం కాబోతుంది. 2019 తర్వాత ‘హోం అండ్ అవే’ విధానంలో జరుగనున్న ఈ లీగ్ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే దక్షిణాదితో పాటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీమణులతో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనుంది.
మార్చి 31న జరుగబోయే తొలి మ్యాచ్ కు ముందు నిర్వహించబోయే ప్రారంభ వేడుకలకు గాను బీసీసీఐ.. పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతున్న రష్మిక మందన్న, తమన్నా భాటియాలను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.
బీసీసీఐ ప్రస్తుతం ముంబై వేదికగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ప్రారంభ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అయిన కృతి సనన్, కియారా అధ్వాణీ లతో పాటు ప్రముఖ పంజాబ్ సింగర్ ఏపీ ధిల్లాన్ లు తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. రాబోయే ఐపీఎల్ లో రష్మిక, తమన్నాలు వారి స్థానాలను భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఈ బ్యూటీలకు తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీలో కూడా క్రేజ్ ఉంది. వీరితో ప్రారంభ వేడుకలను నిర్వహిస్తే అది లీగ్ కు కలిసొస్తుందని బీసీసీఐ భావిస్తున్నది. అయితే రష్మిక, తమన్నాలు ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకలకు హాజరవుతారా..? లేదా..? అన్నదానిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు. రష్మిక, తమన్నాలతో పాటు పలువురు బాలీవుడ్ తారలు కూడా ఈ వేడుకలకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
కాగా ఐపీఎల్ లో కోవిడ్ కు ముందు 2019లో కూడా ప్రారంభ వేడుకలను నిర్వహించలేదు. కాశ్మీర్ లో భారత సైనికులపై పూల్వామా బాంబు దాడి నేపథ్యంలో ఆ ఏడాది ప్రారంభ వేడుకలను రద్దు చేశారు. కోవిడ్ టైమ్ లో స్టేడియాలకు ప్రేక్షకులనే అనుమతించలేదు. నాలుగేండ్ల తర్వాత ఐపీఎల్ లో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక కన్నడలో కిరాక్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఆ తర్వాత తెలుగులో గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతికాలంలోనే తెలుగుతో పాటు సౌత్ లో పాగా వేసి గత కొంతకాలంగా బాలీవుడ్ మీద దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె బన్నీతో పుష్ప సీక్వెల్ తో పాటు బాలీవుడ్ లో రణ్వీర్ కపూర్ తో ఆనిమల్.. వెంకీ కుడుమలతో నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నది.
హ్యాపీడేస్ తో తెలుగులో కమర్షియల్ సక్సెస్ కొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించింది. బన్నీతో బద్రీనాథ్ సినిమాలో నటించిన తమన్నా.. ప్రస్తుతం చిరంజీవితో బోళా శంకర్, రజినీకాంత్ తో జైలర్ లలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణమూ సాగిస్తోంది. మరి రష్మిక, తమన్నాలు ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో ఎలా అలిరస్తారో చూడాలి.