Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ క్రికెటర్లపై పగబట్టిన కరోనా.. వసీం అక్రమ్ తో పాటు మరో నలుగురికీ పాజిటివ్.. పీఎస్ఎల్ జరిగేనా..?

Wasim Akram Tests Corona Positive:  ఈ నెల 27 నుంచి పాక్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన పాకిస్థాన్  ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్-2022) నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.  లీగ్ కు  ముందే వివిధ ఫ్రాంచైజీలలోని క్రికెటర్లు కరోనా బారిన పడుతున్నారు.  
 

PSL 2022: Ahead Of Pakistan Super League, Wasim Akram Along with Wahab Riaz and Haider Ali test positive for Covid-19
Author
Hyderabad, First Published Jan 25, 2022, 6:03 PM IST

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా క్రికెటర్లను  వణికిస్తున్నది. బయో బబుల్స్ అంటూ ఆటగాళ్లంతా కఠిన ఆంక్షల నడుమ ఉంటున్నా మాయదారి మహమ్మారి   వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా  పాకిస్థాన్ క్రికెటర్లపై కరోనా పగబట్టింది.  ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తో పాటుగా మరో నలుగురు క్రికెటర్లు వైరస్ బారిన పడ్డారు. అక్రమ్ తో పాటు మిగిలిన క్రికెటర్లకు కరోనా సోకిన నేపథ్యంలో ఈ నెల 27 నుంచి పాక్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన పాకిస్థాన్  ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్-2022) నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.  లీగ్ ప్రారంభమయ్యే నాటికి మరి కొంత మంది క్రికెటర్లు కరోనా బారిన పడితే పరిస్థితి ఏంటని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. 

జనవరి 27 నుంచి పీఎస్ఎల్-7 ప్రారంభం కానున్నది. కరాచీ లోని నేషనల్ స్టేడియం వేదికగా జరిగే తొలి  మ్యాచులో.. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కరాచీ కింగ్స్ తో తలపడబోతుంది.  ఈ లీగ్ ప్రారంభమవడానికి సరిగ్గా  రెండ్రోజుల ముందు పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్, దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పీఎస్ఎల్ లో భాగంగా ఉన్న  కరాచీ కింగ్స్ జట్టుకు అతడే అధ్యక్షుడు కావడం గమనార్హం. 

 

అక్రమ్ తో పాటు పెషావర్ జల్మీ కి చెందిన ఆటగాళ్లు.. వహాబ్ రియాజ్, హైదర్ అలీలకు కూడా  పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఈ ఇద్దరూ లీగ్ లోని  తొలి అంచె మ్యాచులకు దూరమయ్యారు. వీరితో పాటే పెషావర్ జల్మీకి చెందిన కమ్రాన్ అక్మల్, అర్షద్ ఇక్బాల్ లు కూడా కరోనా బారిన పడ్డారు. వీళ్లంతా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వర్గాల ప్రకారం..  వివిధ ఫ్రాంచైజీలకు చెందిన  ముగ్గురు క్రికెటర్లు, ఐదుగురు సహాయక సిబ్బంది ఈ వైరస్ బారిన పడ్డారని పీసీబీ గతంలో వెల్లడించింది.

 

ఫ్రాంచైజీలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పీసీబీ అప్రమత్తమైంది.  పీఎస్ఎల్-2022 లో ఆడబోయే  ఆటగాళ్లందరినీ ఇప్పటికే  క్వారంటైన్ లో ఉంచింది. రోజూ వారికి  ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నదని పీఎస్ఎల్ డైరెక్టర్ నసీర్ తెలిపాడు. గత గురవారం నుంచి  మంగళవారం నాటికి 250  కరోనా పరీక్షలు చేసినట్టు వెల్లడించాడు.

ఒకవేళ లీగ్ ప్రారంభమైనా వైరస్ బారిన పడినవారి సంఖ్య క్రమంగా పెరిగితే టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేసి ఆ తర్వాత తిరిగి ప్రారంభిస్తామని పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా గతంలోనే వెల్లడించాడు.  అయితే రీషెడ్యూల్ లో భాగంగా రోజూ డబుల్ హెడర్స్ (రెండు మ్యాచులు)  ఆడిస్తామని తెలిపాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios