ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో తెలుగు టైటాన్స్ ఆటతీరు మారడం లేదు. ఈ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన టైటాన్స్ దాన్నే కొనసాగిస్తోంది. ఈ  లీగ్ మూడు వారాల్లో మూడు వేదికలు మారినా  టైటాన్స్ మాత్రం ఇప్పటివరకూ ఒక్క విజయాన్ని కూడా సాధించలేదు. ఇలా ఇవాళ(గురువారం) బెంగళూరు బుల్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే తెలుగు జట్టు ఏకంగా 21 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. 

ఈ మ్యాచ్ లో బెంగళూరు రైడర్ పవన్ కుమార్ అదరగొట్టాడు. జట్టు మొత్తం కలిసి 47 పాయింట్లు సాధిస్తే అందులో 17పవన్ అందించినవే. ఇక రోహిత్ 8, మహేందర్ సింగ్ 7 పాయింట్లతో అదరగొట్టారు. విజయ్ కుమార్ 2, అమిత్ 2, సుమిత్ 1 పాయింట్ తో బెంగళూరు విజయంలో తనవంతు పాత్ర పోషించారు. ఇలా రైడింగ్ లో 21, సూపర్ రైడ్ 1, ట్యాకిల్స్ లో 19, ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో రెండు పాయింట్లతో బెంగళూరు 47 పాయింట్లు సాధించగలిగింది. 

తెలుగు  టైటాన్స్ విషయానికి వస్తే గత మ్యాచుల్లో మాదిరిగానే అదే పేలవ ఆటతీరు కనబర్చింది. సిద్దార్థ్ దేశాయ్ 11,విశాల్ భరద్వాజ్ 6, అర్మాన్ 4 పాయింట్లతో రాణించారు. మిగతా ఆటగాళ్లు పాయింట్లు సాధించడంలో విఫలమవడంతో తెలుగు టైటాన్స్ కు ఓటమి తప్పలేదు. టైటాన్స్ రైడింగ్ లో 16, సూపర్ రైడింగ్ ద్వారా 1, ట్యాకిల్స్ లో 10, పాయింట్లు మాత్రమే అందుకుని మొత్తం 26 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. దీంతో  47-26 పాయింట్ల తేడాతో బెంగళూరు చేతిలో టైటాన్స్ మరో పరాజయాన్ని  చవిచూసింది.