సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో దుమ్మురేపిన పృథ్వీ షా... నార్తాంప్టన్‌షైర్ ఘన విజయంలో కీలక పాత్ర.. 

టాలెంట్ టన్నుల్లో ఉన్నా, బద్ధకం, నిర్లక్ష్యంతో దాన్ని వృథా చేసుకుంటున్న క్రికెటర్లలో పృథ్వీ షా పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆడిన మొదటి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన పృథ్వీ షా... దూకుడైన ఆటతీరుతో వీరేంద్ర సెహ్వాగ్ వారసుడిగా పేరు దక్కించుకున్నాడు. 

అయితే ఫిట్‌నెస్‌‌పై సరైన ఫోకస్ పెట్టకుండా భారీగా బరువు పెరిగిపోయిన పృథ్వీ షా, ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమ్‌కి దూరం అయిపోయాడు. ఎట్టకేలకు చాలా గ్యాప్ తర్వాత తన రేంజ్ ఇన్నింగ్స్ ఆడాడు పృథ్వీ షా. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో ఆడుతున్న పృథ్వీ, నార్తాంప్టన్‌షైర్ తరుపున డబుల్ సెంచరీ బాదాడు..

Scroll to load tweet…

ఈ టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన పృథ్వీ షా, పుల్ షాట్‌కి ప్రయత్నించి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తాజాగా సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేసి అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు పృథ్వీ షా..

81 బంతుల్లో సెంచరీ అందుకున్న పృథ్వీ షా, ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచి 48 బంతుల్లోనే రెండో సెంచరీ బాదేశాడు. మొత్తంగా 129 బంతుల్లో డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా..లిస్ట్ ఏ క్రికెట్‌లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. రోహిత్ శర్మ మాత్రమే వన్డే క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీ బాది, లిస్టులో ఈ టాప్‌లో ఉన్నాడు. సచిన్, సెహ్వాగ్, శిఖర్ ధావన్, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, నారాయణ్ జగదీశన్, సంజూ శాంసన్ ఇలా 11 మంది భారత క్రికెటర్లు, లిస్టు ఏ క్రికెట్‌లో ఒక్కో డబుల్ సెంచరీలు బాదారు.

పృథ్వీ షా 244 పరుగులు చేయగా ఎమిలో గే 30, రిచర్డో వస్కోన్‌సిలోస్ 47, వైట్‌మన్ 54 పరుగులు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది నార్తాంప్టన్‌షైర్. ఈ లక్ష్యఛేదనలో 45.1 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సోమర్‌సెట్, 328 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆండ్రూ ఉమీద్ 77, లూయిస్ గోల్డ్‌స్వీర్తీ 47, కర్టీస్ కాంపర్ 49, సీన్ డిక్సన్ 52 పరుగులు చేశారు. నార్తాంప్టన్‌షైర్ జట్టుకి 87 పరుగుల తేడాతో ఘన విజయం దక్కింది.


అండర్19 వరల్డ్ కప్ 2018 గెలిచిన కెప్టెన్‌గా టీమిండియాలోకి వచ్చినా, ఆ తర్వాత కొన్ని రోజులకే గాయంతో టీమ్‌కి దూరమయ్యాడు పృథ్వీ షా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో రీఎంట్రీ ఇచ్చినా ఆడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తీవ్రంగా నిరాశపరచడంతో పృథ్వీ షా, టీమ్‌లో చోటు కోల్పోయాడు.

దేశవాళీ టోర్నీల్లో నిలకడైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో పాటు బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులోనూ పాస్ కాకపోవడంతో పృథ్వీ షాని పూర్తిగా పక్కనబెట్టేసింది బీసీసీఐ..

ఐపీఎల్ 2022 సీజన్‌ పర్ఫామెన్స్ తర్వాత పృథ్వీ షా, తిరిగి టీమ్‌లో చోటు దక్కుతుందని ఆశించాడు. అయితే శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇస్తున్న టీమిండియా, పృథ్వీ షాని మాత్రం పూర్తిగా పక్కనబెట్టేసింది. సాయి బాబా భక్తుడైన పృథ్వీ షా, అంతా ఆయన చూస్తున్నాడంటూ ఇన్‌స్టాలో పోస్టులు పెట్టడం మొదలెట్టాడు. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో డిజాస్టర్ పర్ఫామెన్స్ ఇచ్చి, తుది జట్టులో చోటు కూడా కోల్పోయిన పృథ్వీ షా.. సాయిబాదా మీద వరుస పోస్టులు వేశాడు.