వర్షం పడుతున్నప్పుడు కవర్ లాగేందుకు గ్రౌండ్‌మెన్‌కి సాయపడిన ముంబై సారథి పృథ్వీ షా... ఎల్బీడబ్ల్యూ అవుట్ విషయంలో అంపైర్లతో వాగ్వాదం..
ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌తో టీమిండియాలో చోటు కోల్పోయాడు యంగ్ ఓపెనర్ పృథ్వీషా. ఆస్ట్రేలియా టూర్ 2020-21లో రెండు ఇన్నింగ్స్‌ల్లో అట్టర్ ఫ్లాప్ అయిన పృథ్వీషా, ఆ తర్వాత తిరిగి జట్టులోకి రాలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అతి పిన్న వయసులో టెస్టు ఆరంగ్రేటం చేసిన ప్లేయర్‌గా ఉన్న పృథ్వీషా, రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో ముంబై జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు...
రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్టు, రంజీ ట్రోఫీ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2018లో కెప్టెన్‌గా అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన పృథ్వీషా.. రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచి, టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడ్డాడు...
మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పృథ్వీషా చేసిన ఓ పని, క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకుంది. రంజీ ట్రోఫీ ఫైనల్ ఐదో రోజున ఆటకు వర్షం కాసేపు అంతరాయం కలిగించింది. చినుకులు ప్రారంభం కావడంతో పిచ్‌ను కవర్లకు కప్పారు గ్రౌండ్‌మెన్. ఈ సమయంలో అక్కడే ఉన్న పృథ్వీషా, కవర్‌ను లాక్కెళ్లేందుకు గ్రౌండ్‌మెన్‌కి సాయపడ్డాడు...
అంతకుముందు ఆట నాలుగో రోజున అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు ముంబై కెప్టెన్ పృథ్వీ షా. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులకి ఆలౌట్ కాగా, మధ్యప్రదేశ్ జట్టు 536 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎంత ప్రయత్నించినా వికెట్లు పడకపోవడంతో ముంబై సారథి పృథ్వీ షా అసహనానికి లోనయ్యాడు...
ఇన్నింగ్స్ 125వ ఓవర్‌లో మధ్యప్రదేశ్ 373/3 స్కోరు వద్ద ఉన్నప్పుడు ముంబై బౌలర్ మోహిత్ అవస్తీ వేసిన బాల్, ఆదిత్య శ్రీవాస్తవ ప్యాడ్స్‌కీ, కాలికి మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ముంబై టీమ్, ఎల్బీడబ్ల్యూ అవుట్ కోసం అప్పీలు చేసింది. అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించడంతో వారి వద్దకు వెళ్లిన పృథ్వీషా, కాసేపు వాగ్వాదానికి దిగాడు...
అంపైర్ల దగ్గరికి వెళ్లి ఎందుకు నాటౌట్‌గా ఇచ్చారో చెప్పాలంటూ నిలదీశాడు. అంపైర్ల సమాధానంతో సంతృప్తి చెందని పృథ్వీ షా, వారితో గొడవ పడుతూనే ఉండడంతో ముంబై వికెట్ కీపర్ హార్ధిక్ తమోర్ వచ్చి అతన్ని పక్కకు తీసుకెళ్లాడు.
ఫైనల్‌లో ముంబై ఓటమిపై స్పందించిన పృథ్వీ షా... ‘బాయ్స్ చాలా చక్కగా ఆడాడు. కొందరు కొత్త ప్లేయర్లు అద్భుతమైన పోరాట ప్రటిమ చూపించారు. ముంబై క్రికెట్ అంటే ఇది. అయితే ప్రతీ రోజు మనది కాదు. మధ్యప్రదేశ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారి బౌలర్లు మాకంటే మెరుగ్గా రాణించారు. అందుకే టైటిల్ గెలిచారు. మేం మరింత మెరుగ్గా వెనక్కి వస్తాం...ఈ సారి మరింత మెరుగైన పర్ఫామెన్స్ ఇస్తాం... ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించడం నాకెప్పుడూ గర్వకారణమే...’ అంటూ చెప్పుకొచ్చాడు.
