ఐపీఎల్ 2016 సమయంలో అజింకా రహానే నుంచి ఆ టెక్నిక్ నేర్చుకున్నానని తెలిపిన ఆస్ట్రేలియా బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్... సిరీస్‌లో వెనకబడినా ఇంకా సమయం మించిపోలేదంటూ కామెంట్.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 సీజన్‌లో మూడు టెస్టులకు కెప్టెన్సీ చేసి, టీమిండియాకి సిరీస్ అందించాడు అజింకా రహానే... విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసిన ఆడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న భారత జట్టు.. అజింకా రహానే కెప్టెన్సీలో మూడింట్లో రెండు విజయాలు అందుకుని, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది..

కెప్టెన్‌గా అపజయం ఎరుగని అజింకా రహానే, పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత టెస్టు టీమ్‌లో ప్లేస్ కోల్పోయిన అజింకా రహానే, ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2023 సీజన్ ద్వారా తిరిగి భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు అజింకా రహానే...

నాగ్‌పూర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్, ఢిల్లీ టెస్టులో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ రెండు టెస్టుల్లో తన ఇన్నింగ్స్‌లకు అజింకా రహానే కారణమని కామెంట్ చేశాడు పీటర్ హ్యాండ్స్‌కోంబ్...

‘2016 ఐపీఎల్‌ టైమ్‌లో నేను అజింకా రహానేతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నా... స్పిన్ బౌలింగ్‌ని ఫేస్ చేయడంలో రహానే స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బ్యాట్‌ ఫుట్‌ నుంచి మిడ్ వికెట్ మీదుగా షాట్స్ ఆడడం చూసి ఆశ్చర్యపోయా...

ఎలాగైనా ఆ టెక్నిక్ నేర్చుకోవాలని అనుకున్నా. వెళ్లి నాకు కూడా నేర్పించమని అడిగాను. అజింకా రహానే వెంటనే సరే అన్నాడు. బ్యాక్ ఫుట్ మీద పరుగులు చేయడం ఎలాగో నేర్పించాడు. అంతేకాదు మంచి బంతులను డిఫెండ్ ఎలా చేయాలి, కాస్త తేడాగా వచ్చిన బాల్స్‌ని బౌండరీకి ఎలా పంపించాలో చెప్పాడు...

ఇప్పుడు ఇండియాలో నా సక్సెస్‌కి అజింకా రహానే దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్‌ కారణం. పిచ్‌ని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటున్నా. ఆ తర్వాత అవకాశం వచ్చినప్పుడుల్లా షాట్స్ ఆడుతున్నా.. ప్రతీ మ్యాచ్‌లోనూ మొదటి నుంచి మొదలెట్టడం నాకు అలవాటు...

నేను రెండో టెస్టులో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచా. అంటే మూడో టెస్టులో అక్కడి నుంచే మొదలెడతా. ఎక్కడ వదిలేశానో అక్కడి నుంచే లెక్కబెడతా. బౌలర్ ఎవరైనా సరే, సెషన్ల పాటు ప్రాక్టీస్‌లో ఉంటాను.. లెగ్ సైడ్ షాట్స్ ఆడడం నాకు బాగా ఇష్టం. అలాగని దాని మీదనే డిపెండ్ అవ్వను. నేను లెగ్ సైడ్ ఆడతానని అటు వైపు ఫీల్డర్లను మోహరిస్తే, ఆఫ్ సైడ్ ఆడడం మొదలెడతా...

మొదటి రెండు మ్యాచుల్లో గెలవకపోయినా, సిరీస్‌లో పైచేయి సాధించడానికి మాకు ఇంకా సమయం ఉంది. మిగిలిన రెండు టెస్టుల్లో ఇండియాకి పోటీ ఇస్తామని నమ్మకం ఉంది. వెంటవెంటనే రెండు మూడు వికెట్లు కోల్పోయి, ఆ తర్వాత కుదురుకోలేకపోతున్నాం. దానిపై ఫోకస్ పెట్టాలి..

వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగితే భారీ స్కోరు చేయొచ్చు. కనీసం చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ పోతే, ప్రత్యర్థి జట్టుపై ప్రెషర్ పెట్టేందుకు అవకాశం దొరుకుతుంది... వచ్చే మ్యాచుల్లో వీటిపై ఫోకస్ పెడతాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్..

2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్‌లో 109 పరుగులు చేసిన పీటర్ హ్యాండ్స్‌కోంబ్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరుపున మార్కస్ లబుషేన్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్..