వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లకు అలాగే మిగతా సహాయక సిబ్బందికి రావాల్సిన వీసాలపై బీసీసీఐ బాధ్యత వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి తెలియజేసింది.

దాయాదుల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. వచ్చేఏడాది అక్టోబరులో భారత్‌ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌క్‌పకు సంబంధించిన వీసాల విషయంలో ఐసీసీ హామీని పాకిస్థాన్‌ కోరుకుంటోంది.

ఇదే విషయమై జనవరి కల్లా స్పష్టత ఇవ్వాలని ఐసీసీని అడిగినట్టు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సీఈవో వసీం ఖాన్‌ చెప్పాడు. ‘టోర్నీలో పాల్గొనే జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి వీసాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆతిథ్య దేశానిదే.

అందుకే ఐసీసీకి మా ఆందోళనను వ్యక్తపరిచాం’ అని వసీం తెలిపాడు. ఈ విషయంపై బీసీసీఐతో ఐసీసీ చర్చిస్తుందన్నాడు. ఇది మాములు ద్వైపాక్షిక సిరీస్ కాదు. ఒక ఐసీసీ టోర్నీ. కాబట్టి దానికి ఆతిధ్యం ఇచ్చే బోర్డు అందులో పాల్గొనే ప్రతి జట్టుకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకోవాలి అనే నియమం ఉంది.

అందువల్ల అందులో పాల్గొనే జట్లలో ఒకటైన మా పాకిస్థాన్ జట్టుకు కూడా వీసా విషయంలో ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ మీద ఉంటుంది. కాబట్టి మాకు ఆ సమస్య రాదు అని బీసీసీఐ చేత చెప్పించాలని పాక్ బోర్డు ఐసీసీని కోరింది. 

కాగా మొదట ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌కు హోస్టింగ్ బాధ్యతలు పీసీబీ దక్కించుకున్న తర్వాత తమ ఆటగాళ్లను పంపించడం కుదరదని మరెక్కడైనా దానిని నిర్వహిస్తేనే మా జట్టును పంపిస్తామని బీసీసీఐ తెలిపింది.

అయితే ముందు కుదరదు అని చెప్పిన పీసీబీ తర్వాత ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ 20 ప్రపంచ కప్ కు బీసీసీఐ ఆతిధ్యం ఇవ్వనుంది.

మా దేశంలోకి రావడానికి ఒప్పుకోనివారు మమ్మల్ని తమ దేశంలోకి రాణిస్తారా... అప్పుడు పీసీబీ ప్రశ్నించి... భారత్ కు వీసాలు పొందడంలో తమ జట్టుకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని బీసీసీఐ నుండి లిఖితపూర్వక హామీలు ఇప్పించాలని ఐసీసీ ని కోరింది.