Asianet News TeluguAsianet News Telugu

IPL vs PSL: ఐపీఎల్‌ను ఢీకొడతానంటున్న పాకిస్తాన్ సూపర్ లీగ్..! బీసీసీఐని తట్టుకుని నిలబడే దమ్ముందా..?

IPL vs PSL: కనుసైగతో  ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో  ఢీకొడతానంటున్నది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).  2025లో ఈ రెండు బోర్డుల మధ్య ఆసక్తికర పోరు తప్పేట్లు లేదు. 

Pakistan Super League To Clash With Indian Premier League in 2025 due to This Reason
Author
First Published Aug 17, 2022, 6:03 PM IST

క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  మైదానంలో పోరు సంగతి పక్కనబెడితే ఆటగాళ్లు, అభిమానులే తప్ప బీసీసీఐ, పీసీబీలు ఏదైనా అంశంలో ప్రత్యక్షంగా పోటీ పడిన సందర్బాలు చాలా అరుదు. కానీ  రాబోయే రోజుల్లో ఇరు బోర్డులు ‘ఢీ’కొనబోతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇరు బోర్డులూ ముఖాముఖి తలపడకున్నా అంతకంటే రసవత్తర సమరమే జరిగేట్టు ఉంది.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తో  ఢీకొనేందుకు  పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) సిద్ధమవుతున్నది. 

అసలు విషయానికొస్తే.. 2025లో  ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్ తప్పేట్టు లేదు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన  ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) ప్రకారం..  2025లో  పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. దీని కారణంగా పీసీబీ.. తమ ఆధ్వర్యంలో నిర్వహించే పీఎస్ఎల్  ను వాయిదా వేయనుంది. పీఎస్ఎల్ సాధారణంగా డిసెంబర్-జనవరిలలో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోపీ కోసం పీఎస్ఎల్ ను పాకిస్తాన్ వాయిదా వేయనంది.   ఈ మెగా టోర్నీని మార్చి లేదా మే లో జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నది. 

అక్కడే వచ్చింది అసలు చిక్కు.. 

పాకిస్తాన్ తన సౌలభ్యం కోసం మార్చి లేదా మే లో చేసుకుంటే అది ఐపీఎల్ తో   ప్రత్యక్షంగా ఢీకొన్నట్టే. ఐపీఎల్ సీజన్ మార్చి-మే లో ఉంటుంది. దీంతో  మార్చి నుంచి మే వరకు ఎప్పుడు పీఎస్ఎల్ జరిపినా అది ఇరు బోర్డుల మధ్య యుద్ధమే. ఐపీఎల్ లో ఆడే పలువురు ఆటగాళ్లు పీఎస్ఎల్ లో కూడా ఆడతారు. దీంతో ఆటగాళ్ల డేట్స్ తో పాటు షెడ్యూల్ కూడా మార్చాల్సి ఉంటుంది.

 

అంత ధైర్యం చేస్తుందా..? 

పీఎస్‌ఎల్ తో పోల్చితే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఇక్కడ పది మ్యాచ్ ల విలువ కాదు పీఎస్ఎల్ మొత్తం విలువ. అలాంటిది పీసీబీ.. ఐపీఎల్ ను ఢీకొనే సాహసం చేస్తుందా..? అంటే అనుమానమే. అదీగాక ప్రపంచ క్రికెట్ నే తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్న బీసీసీఐతో పీసీబీ ప్రత్యక్ష పోరుకు దిగుతుందా..? దిగినా బతికి బట్టకడుతుందా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఐపీఎల్ తో పీఎస్ఎల్ ఢీకొంటుందా..? లేక షెడ్యూల్ ను ముందుకో వెనక్కో జరుపుకుంటుందా..? అనేది కాలం తేల్చనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios