‘ది హాండ్రెడ్’ డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని పాక్ ద్వయం బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్... ఐసీసీ టాప్ ర్యాంకర్లను పట్టించుకోని ఫ్రాంఛైజీలు.. ఒకే టీమ్ తరుపున షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్.. 

పాకిస్తాన్ క్రికెట్ స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లకు ఘోర అవమానం జరిగింది. ‘ది హండ్రెడ్’ లీగ్ 2023 సీజన్‌ డ్రాఫ్ట్‌లో ఈ ఇద్దరు స్టార్లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. టీ20 ఫార్మాట్‌లో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ ఘనమైన రికార్డులు ఉన్నాయి. ఇదే నెలలో జరిగిన పాక్ సూపర్ లీగ్ 2023 సీజన్‌లోనూ సెంచరీల మోత మోగించారు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్..

జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్నా చితకా టీమ్స్‌పై సెంచరీలు బాది.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో చాలా రోజుల పాటు నెం.1 బ్యాటర్‌ ర్యాంకుని అనుభవించాడు బాబర్ ఆజమ్. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ కూడా నెం.1 ర్యాంకుకి ఎగబాకాడు. అయితే ఈ ఇద్దరినీ వెనక్కినెట్టిన సూర్యకుమార్ యాదవ్... ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. నెం.2లో మహ్మద్ రిజ్వాన్, నెం.3లో బాబర్ ఆజమ్ ఉన్నారు.. 

అయితే ఈ ఇద్దరు పాక్ బ్యాటర్లను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం విశేషం. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ మాత్రం భారీ ధర దక్కించుకున్నాడు. ‘ది హాండ్రెడ్’ డ్రాఫ్ట్‌లో షాహీన్ ఆఫ్రిదీ కోసం ఏకంగా లక్ష పౌండ్లు (పాకిస్తాన్ కరెన్సీలో అయితే 3 కోట్ల 48 లక్షల పాక్ రూపాయలు) చెల్లించేందుకు సిద్ధమైంది వెల్ష్ ఫైర్ టీమ్...

అలాగే పాక్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రైఫ్ కూడా వెల్ష్ ఫైర్ టీమ్ తరుపున ఆడబోతున్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌తో పాటు కిరన్ పోలార్డ్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా వంటి స్టార్ ప్లేయర్లు కూడా 125000 పౌండ్ల కేటగిరిలో అమ్ముడుపోలేదు. అయితే ఆ తర్వాత లక్ష పౌండ్ల డ్రాఫ్ట్ కేటగిరలో ఆడమ్ జంపా, ఆండ్రూ రస్సెల్, డ్వేన్ బ్రావో, ట్రెంట్ బౌల్ట్‌లను కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు...

బాబర్ ఆజమ్, ఐపీఎల్‌లో కానీ వేలానికి వస్తే ఈజీగా రూ.20 కోట్లు దక్కించుకుంటాడని కూతలు కూసిన పాక్ మాజీ క్రికెటర్లకు, ‘ది హాండ్రెడ్’ డ్రాఫ్ట్‌లో జరిగిన అవమానం చెంపపెట్టులా మారింది. ఐపీఎల్ కంటే బీబీఎల్‌ చాలా గొప్పదని కామెంట్ చేసిన బాబర్ ఆజమ్, ఇప్పుడు ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఆడే అవకాశం కూడా కోల్పోయాడు..

సునీల్ నరైన్, వానిందు హసరంగ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రషీద్ ఖాన్, నాథన్ ఎల్లీస్, షాదబ్ ఖాన్, ఆడమ్ మిల్నే, కోలిన్ మున్రో, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్, జోష్ లిటిల్, వేన్ పార్నెల్ వంటి ప్లేయర్లకు ‘ది హాండ్రెడ్’ గ్రాఫ్ట్‌లో చోటు దక్కింది. ఐపీఎల్ మాదిరిగానే ‘ది హాండ్రెడ్’ లీగ్‌లో కూడా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ప్లేయర్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చాయి ఫ్రాంఛైజీలు..