ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి, ఐసీసీ నెం.1 వన్డే టీమ్‌గా పాకిస్తాన్... ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్! ఆసియా కప్‌లో ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభానికి ముందు పొరుగు దేశం పాకిస్తాన్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేసింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్, ఐసీసీ నెం.1 వన్డే టీమ్‌గా ఉన్న ఆస్ట్రేలియాని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆఫ్ఘాన్‌తో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.

బాబర్ ఆజమ్ 86 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 79 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేశాడు. అఘా సల్మాన్ 38, మహ్మద్ నవాజ్ 30, ఫకార్ జమాన్ 27 పరుగులు చేశారు. 

ఈ లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 48.4 ఓవర్లలో 209 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రియాజ్ హసన్ 34, హసీముల్లా కమల్ 37 పరుగులు చేయగా 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన ముజీబ్ ఉర్ రహీమ్ హిట్ వికెట్‌గా అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన ముజీబ్ ఉర్ రహీమ్, ఆఫ్ఘాన్ తరుపున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.

Scroll to load tweet…

రెండో వన్డేలో ఆఖరి ఓవర్ పోరాడిన ఆఫ్ఘానిస్తాన్, చివరి వికెట్ తీయడంలో విఫలం కావడంతో 1 వికెట్ తేడాతో పాకిస్తాన్‌కి విజయం దక్కింది. తొలి వన్డేలోనూ బౌలింగ్‌లో అదరగొట్టిన ఆఫ్ఘాన్, 59 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

ఈ సిరీస్‌కి ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ని గెలిచిన పాకిస్తాన్, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ని దక్కించుకుంది. జూన్‌లో టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచిన ఆస్ట్రేలియా, వచ్చే నెల మరోసారి భారత పర్యటనలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ గెలిస్తే మళ్లీ ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌‌కి ఎగబాకుతుంది.

113 పాయింట్లతో ఉన్న టీమిండియా, ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ని ఓడించి, ఆస్ట్రేలియాని వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేస్తే వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళ్తుంది. మొదటి వన్డేలో డకౌట్ అయినా ఆ తర్వాత వరుసగా రెండు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బాబర్ ఆజమ్, ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడు..

పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ మూడో స్థానంలో, ఐదో స్థానంలో ఫకార్ జమాన్ ఉన్నారు. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో ముగ్గురు పాకిస్తాన్ బ్యాటర్లు ఉండడం విశేషం. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్ ఆఫ్రిదీ, టాప్ 9లో ఉన్నాడు.