Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో పాక్ మాజీ కెప్టెన్...

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత కనిపించని సర్ఫరాజ్ అహ్మద్... న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహ్మద్ రిజ్వాన్ స్థానంలో సర్ఫరాజ్‌‌ఛాన్స్... 

Pakistan former Captain Sarfaraz Ahmed playing test match after 3 Years, Babar Azam
Author
First Published Dec 26, 2022, 12:35 PM IST

2019 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరాభవం తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు అప్పటి పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. ఏ మాత్రం ఫిట్‌నెస్ లేకుండా భారీ పొట్టతో కనిపించే సర్ఫరాజ్ అహ్మద్, వికెట్ల వెనకాల ఆవలిస్తూ చాలాసార్లు కెమెరాకి చిక్కాడు. ఈ టోర్నీ తర్వాత కెప్టెన్సీ కోల్పోయి, టీమ్‌లో చోటు కూడా మిస్ చేసుకున్న సర్ఫరాజ్ అహ్మద్... మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు... పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ టెస్టుల్లో వరుసగా విఫలం అవుతుండడంతో  అతని స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్‌కి అవకాశం కల్పించంది పాక్...

పీసీబీ అధ్యక్ష పదవి నుంచి రమీజ్ రాజా తప్పుకోగానే సర్ఫరాజ్ అహ్మద్ తుదిజట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రీఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్ అహ్మద్. సర్ఫరాజ్‌కి ఇది కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్. పాకిస్తాన్ తరుపున 50కి పైగా టెస్టులు ఆడిన నాలుగో వికెట్ కీపర్‌గా నిలిచాడు సర్ఫరాజ్ అహ్మద్...

ఇంతకుముందు పాకిస్తాన్ తరుపున వసీం బరి 81 టెస్టులు ఆడగా మోయిన్ ఖాన్ 66 టెస్టు మ్యాచులు ఆడాడు. కమ్రాన్ అక్మల్ 53 టెస్టు మ్యాచులు ఆడి టాప్ 3లో ఉన్నాడు. 35 ఏళ్ల 218 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్, వసీం బరి తర్వాత అతి పెద్ద వయసులో టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్‌గా నిలిచాడు...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన పాకిస్తాన్ జట్టు, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు, 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది...

కేన్ విలియంసన్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్ టెస్టు సారథిగా బాధ్యతలు అందుకున్నాడు టిమ్ సౌథీ. పూర్తి స్థాయి కెప్టెన్‌గా టిమ్ సౌథీకి ఇదే మొదటి టెస్టు...

అబ్దుల్లా సఫీక్ 7 పరుగులు చేసి అవుట్ కాగా షాన్ మసూద్ 3 పరుగులకి అవుట్ అయ్యాడు. ఈ ఇద్దరూ స్టంపౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. పాక్ క్రికెట్ చరిత్రలో మొదటి రెండు వికెట్లు స్టంపౌట్ రూపంలో కోల్పోవడం ఇదే తొలిసారి...

24 పరుగులు చేసిన ఇమామ్ వుల్ హక్ కూడా బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్. 34 బంతుల్లో 22 పరుగులు చేసిన సౌద్ షకీల్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పాకిస్తాన్..

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 79 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసి మరో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఏడాది బాబర్ ఆజమ్‌కి ఇది 25వ 50+ స్కోరు. కెప్టెన్‌గా ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు 50+ స్కోర్లు బాదిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచాడు బాబర్ ఆజమ్...

2005లో ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ 24 సార్లు ఈ ఫీట్ సాధించగా, బాబర్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios