టీ20 బ్లాస్ టోర్నీల్లో రికార్డు స్పెల్‌తో రీఎంట్రీ చాటుకున్న షాహీన్ ఆఫ్రిదీ... మొదటి ఓవర్‌లోనే 4 వికెట్లు, అయినా తన టీమ్‌ని గెలిపించలేకపోయిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్..
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మొట్టమొదటిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో ఓటమి చవిచూసింది టీమిండియా. పాక్ యంగ్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ దెబ్బకు రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయితే కెఎల్ రాహుల్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు.. హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసిన విరాట్ కోహ్లీ కూడా షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..
ఈ మ్యాచ్ తర్వాత షాహీన్ ఆఫ్రిదీకి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. గాయంతో ఆసియా కప్ 2022 టోర్నీకి దూరంగా ఉన్న షాహీన్ ఆఫ్రిదీ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు..
గాయం తిరగబెట్టడంతో కొంత కాలంగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న షాహీన్ ఆఫ్రిదీ, టీ20 బ్లాస్ టోర్నీల్లో రికార్డు స్పెల్‌తో ఇరగదీశాడు. నాటింగమ్‌షైర్ క్లబ్ తరుపున ఆడుతున్న షాహీన్ ఆఫ్రిదీ, వార్‌విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో 4 వికెట్లు తీశాడు..
టీ20 చరిత్రలో మొదటి ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు షాహీన్ ఆఫ్రిదీ.. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగమ్‌షైర్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. జో క్లర్క్ 26 పరుగులు చేసి టామ్ మూరెస్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. లీడన్ జేమ్స్ 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేయగా మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయారు. బ్యాటింగ్‌లో షాహీన్ ఆఫ్రిదీ 1 పరుగులకే అవుట్ కాగా మరో పాక్ ప్లేయర్ ఇమాద్ వసీం 2 పరుగులు చేశాడు..
ఈ లక్ష్యఛేదనలో మొదటి ఓవర్‌లోనే 4 వికెట్లు కోల్పోయింది వార్‌విక్‌షైర్. 5 వైడ్లతో ఇన్నింగ్స్‌ని మొదలెట్టాడు షాహీన్ ఆఫ్రిదీ. ఆ తర్వాత మొదటి బంతికి అలెక్స్ డేవిస్‌ని ఎల్బీడబ్ల్యూ చేసిన షాహీన్ ఆఫ్రిదీ, రెండో బంతికి క్రిస్ బెంజిమన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడు, నాలుగు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. ఆ తర్వాత మౌస్లే, క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ఆఖరి బంతికి బర్నార్డ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి ఓవర్‌లో 7 పరుగులే చేసి 4 వికెట్లు కోల్పోయింది వార్‌విక్‌షైర్...
అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ 19 పరుగులు, రాబర్డ్ యేట్స్ 65 పరుగులు, హసన్ ఆలీ 7, జాక్ లిటాట 27 పరుగులు చేసి వార్‌విక్‌షైర్‌కి 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. మొదటి ఓవర్‌లో 4 వికెట్లు తీసిన షాహీన్ ఆఫ్రిది, 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 29 పరుగులు ఇచ్చి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..
వచ్చే నెలలో ఆసియా కప్ 2023, ఆ తర్వాత అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఉండడంతో షాహీన్ ఆఫ్రిదీ, తన బీభత్సమైన ఫామ్‌తో మిగిలిన టీమ్స్‌కి హెచ్చరికలు పంపుతున్నట్టే ఉంది.
