సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డును నెలకొల్పాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్సుల్లో 13 వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా బాబర్ రికార్డు సాధించాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీద ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టాడు. అదే విధంగా హషీమ్ ఆమ్లా రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 

అంతకు ముందు కోహ్లీ 13 వన్డే సెంచరీలకు 86 ఇన్నింగ్సు తీసుకున్నాడు. హషీమ్ ఆమ్లా 83 ఇన్నంగ్సుల్లోనే దాన్ని సాధించాడు. బాబార్ ఆజమ్ 76 ఇన్నింగ్సుల్లోనే 13 వన్డే సెంచరీలు సాధించడం ద్వారా రికార్డులను తిరగ రాశాడు. 

శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డే ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం కోసం పోటీ పడ్డాయి. చివరకు మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను డస్సెన్ సెంచరీ ద్వారా ఆదుకున్నాడు. 134 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిల్లర్ తో కలిసి ఐదో వికెట్ కు 116 పరుగులు జోడించాడు. మిల్లర్ అర్థ సెంచరీ చేశాడు. 

కాగా, చివరి ఓవరులో పాకిస్తాన్ కు విజయం కోసం కేవలం 3 పరుగులు అవసరమయ్యాయి.  చివరి ఓవరు వేసిన పేసర్ ఫెలుక్వాయో తొలి బంతికి షాదాబ్ ఖాన్ ను అవుట్ చేశాడు. తర్వాతి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దాంతో పాకిస్తాన్ 2 బంతులకు మూడు పరుగులు చేయాల్సిన సంకట స్థితిలో పడింది. ఫాహిమ్ అష్రఫ్ ఐదో బంతికి రెండు పరుగులు చేశాడు. చివరి బంతికి మరో పరుగు చేశాడు. దీంతో విజయం పాకిస్తాన్ ను వరించింది.