PAKvsENG: తొలి ఇన్నింగ్స్ లో కాస్తో కూస్తో రాణించిన పాక్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్, తొలి టెస్టు ఆడుతున్న కుర్రాడు రెహన్ అహ్మద్ ఐదు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు.
వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయినా పాకిస్తాన్ ఆటలో మార్పు రాలేదు. కరాచీ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తున్న ఆ జట్టు ఆశలు అడియాసలే అయ్యేలా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో కాస్తో కూస్తో రాణించిన పాక్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్, తొలి టెస్టు ఆడుతున్న కుర్రాడు రెహన్ అహ్మద్ ఐదు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. ఫలితంగా పాకిస్తాన్.. 74.5 ఓవర్లలో 216 పరుగులకే చాపచుట్టేసింది. ఇంగ్లాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
కరాచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 304 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 354 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. మూడో రోజు ఉదయం కూడా పాకిస్తాన్ బాగానే ఆడింది.
ఓపెనర్లిద్దరూ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించారు. షఫీక్ (26), షాన్ మసూద్ (24) లు నిష్క్రమించిన తర్వాత తన కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న అజర్ అలీ (0) డకౌట్ అయ్యాడు. ఈ మూడు వికెట్లూ జాక్ లీచ్ కే దక్కాయి. కెప్టెన్ బాబర్ ఆజమ్ (54), సౌద్ షకీల్ (53) లు కాసేపు పోరాడారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 110 పరుగులు జోడించారు. కానీ రెహన్ అహ్మద్ ఈ జోడీని విడదీశాడు. పాక్ ఇన్నింగ్స్ 52 ఓవర్ చివరి బంతికి అతడు బాబర్ ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే షకీల్ ను కూడా ఔట్ చేశాడు. అదే ఊపులో రిజ్వాన్ (7), అగా సల్మాన్ (21) లను వెనక్కి పంపాడు. ఆ తర్వాత పాకిస్తాన్ లోయరార్డర్ కూడా క్రీజులో నిలువలేకపోయింది. ఫలితంగా పాక్.. 74.5 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌట్ అయింది.
17 ఏండ్ల కుర్రాడు రెహన్ అహ్మద్ ఐదు వికెట్లతో చెలరేగగా జాక్ లీచ్ కు మూడు వికెట్లు దక్కాయి. మార్క్ వుడ్, జో రూట్ లకు తలా వికెట్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు ముగిసేటప్పటికే ఆ జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 58 పరగులు చేసింది. ఓపెనర్ జాక్ క్రాలే (22 బంతుల్లో 34 నాటౌట్), బెన్ డకెట్ (14 బంతుల్లో 24 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నారు.
రావల్పిండి, ముల్తాన్ లలో గెలిచి సిరీస్ ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్న ఇంగ్లాండ్ కరాచీలో కూడా విజయానికి అత్యంత చేరువలో ఉంది. ఈ టెస్టులో ఓడితే పాకిస్తాన్ పై విజయం పరిపూర్ణం అవుతుంది.
