ఫిఫా వరల్డ్ కప్‌లో మా ఫేవరేట్ టీమ్ ఎప్పుడో బ్యాగ్ సర్దేసింది : కెఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
FIFA World Cup 2022: ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో నేడు తుది పోరు జరుగనున్నది. అర్జెంటీనా - ఫ్రాన్స్ మధ్య నేటి రాత్రి లుసాలీ స్టేడియంలో ఫైనల్ పోరు జరగాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. రెండు టెస్టులలో భాగంగా ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ బంగ్లాపై 188 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయం తర్వాత నిర్వహించిన పాత్రికేయులు సమావేశంలో ఫిఫా ప్రపంచకప్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ ఆసక్తికర సమాధానాలిచ్చాడు. ఫిఫాలో టీమిండియా లో మెజారిటీ ఆటగాళ్లు సపోర్ట్ చేసే టీమ్ ఇప్పటికే క్వార్టర్స్ లోనే బ్యాగ్ సర్దేసిందని రాహుల్ వ్యాఖ్యానించాడు.
టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ తో మాట్లాడానికి వచ్చిన రాహుల్ కు జర్నలిస్టులు ‘నేడు ఫిఫా ఫైనల్ ఉంది కదా. మీ టీమ్ లో మెస్సీకి సపోర్ట్ చేస్తున్నారా..? లేక ఫ్రాన్స్ కా..? మీరు ఫిఫా ను చూస్తున్నారా..?’ అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నలకు రాహుల్ సమాధానమిస్తూ.. ‘ఏమో మరి (మెస్సీకి సపోర్ట్ చేస్తున్నారా..? అన్న ప్రశ్నకు). నాకైతే తెలియదు. నాకు తెలిసి టీమ్ లో మెజారిటీ ఆటగాళ్లు సపోర్ట్ చేస్తున్న జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీమిండియాలో చాలామంది బ్రెజిల్, ఇంగ్లాండ్ టీమ్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ రెండు టీమ్స్ క్వార్టర్స్ లోనే నిష్క్రమించాయి. అర్జెంటీనా - ఫ్రాన్స్ ఫ్యాన్స్ ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఐదు రోజుల పాటు టెస్టు మ్యాచ్ ఆడి కాస్త అలిసిపోయినట్టు ఉన్నాం. అందుకే నేటి రాత్రి పిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్ చూసి ఎంజాయ్ చేస్తాం. మా ఫేవరేట్ టీమ్స్ పరంగా మేం డివైడ్ అయినా అందరం కలిసే మ్యాచ్ చూస్తాం..’అని అన్నాడు.
టీమిండియా ఆటగాళ్లలో క్రికెట్ తో పాటు ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే. వార్మప్, ప్రాక్టీస్ సెషన్స్ కోహ్లీ, శ్రేయాస్, చాహల్, రాహుల్, శుభమన్ గిల్ వంటి ఆటగాళ్లు ఫుట్‌బాల్ ఆడే ఫోటోలు, వీడియోలు నెట్టింట వీక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఫిఫా ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు మెజారిటీ ప్లేయర్లు రాత్రైనా సరే ఫుట్‌బాల్ మ్యాచ్ లు చూసి పడుకుంటున్నారట.
నేటి రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. అర్జెంటీనాతో పోటీ పడనుంది. చివరి ప్రపంచకప్ ఆడుతున్న మెస్సీ తన వరల్డ్ కప్ లోటును తీర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా.. వరుసగా రెండో సారి (గెలిస్తే మూడోసారి) కప్ కొట్టడానికి ఫ్రాన్స్ ఉవ్విళ్లూరుతున్నది. మరి నేటి రాత్రి ఖతర్ లో విశ్వవిజేతగా నిలిచేదెవరోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. టీమిండియా ఫేవరేట్ టీమ్ అయిన బ్రెజిల్ ఫిఫా వరల్డ్ కప్ లో ఫేవరేట్ గా బరిలోకి నిలిచినా క్వార్టర్స్ లోనే ఇంటిబాటపట్టింది.